ఢిల్లీలో ఏపీ భవన్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల అధికారులతో భేటీ అయిన కేంద్రం.. తాజాగా, ఏపీ భవన్ విభజనకు సంబంధించిన వివరాలను రెండు రాష్ట్రాల అధికారులకు చెప్పింది. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనపై గురువారం కేంద్ర హోం శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఏప్రిల్ 26వ తేదీన రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోం శాఖ భేటీ అయింది. ఈ భేటీ వివరాలను రెండు రాష్ట్రాల అధికారులకు పంపింది. భూములు, భవనాల విభజనపై గతంలో ఆంధ్రప్రదేశ్ మూడు ప్రతిపాదనలు చేసింది. ఈ క్రమంలోనే ఆస్తుల విభజనపై తాజాగా తెలంగాణ మరో ప్రతిపాదన పెట్టింది. గోదావరి, శబరి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలం ఇవ్వాలని తెలంగాణ ప్రతిపాదించింది.
అయితే, కేంద్ర హోంశాఖ మాత్రం.. తెలంగాణ ప్రతిపాదనకు పూర్తిగా భిన్నమైన ప్రతిపాదన చేసింది. 7.64 ఎకరాల పటౌడీ హౌస్‌ను తెలంగాణ తీసుకోవాలని, మిగిలిన 12.09 ఎకరాల ఖాళీ భూమి ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని పేర్కొంది. ఈ ఆస్తులను 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ పంచుకోవాలని కేంద్రం సూచించింది. ఏపీకి అదనపు భూమి దక్కితే తెలంగాణకు ఏపీ నుంచి భర్తీ చేసుకోవాలని తెలిపింది.
తాజాగా, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనతో ఏపీ, తెలంగాణ జనాభా నిష్పత్తికి అనుగుణంగా రెండు రాష్ట్రాలకు వాటా దక్కుతుంది. కేంద్ర ప్రతిపాదన ఆచరణయోగ్యంగా ఉందన్న ఏపీ ప్రభుత్వం.. మూడు ఆప్షన్లను పరిశీలించి తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. అయితే, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. రెండు రాష్ట్రాలు ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.