లక్ష రూపాయలకు లక్షా 20 వేలు ఇస్తామంటే ఆశపడ్డాడు. ఏకంగా లక్ష రూపాయలు వెంటతెచ్చుకుందామనే ఆశతో తనవద్దనున్న ఐదు లక్షల నగదు తీసుకెళ్లాడు. తీరా చూస్తే.. సీన్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆశకు పోతే అదేదో అయ్యిందన్నట్లు.. వచ్చే డబ్బు సంగతి దేవుడెరుగు.. తనవద్దనున్న ఐదులక్షలు తీసుకెళ్లిపోయారు. కానీ.. బాధితుడికి తెలియని విషయం... వేరే ఉంది.. 2 వేల రూపాయల నోట్లు రద్దు కాబోతున్నాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను చిత్తూరు జిల్లా వి.కోట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన జమీర్ అనే వ్యక్తి ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. త్వరలో రెండువేల రూపాయల నోట్లు రద్దు అవుతున్నాయని జమీర్ ప్రచారం చేసినట్లు పోలీసులు వివరించారు.
తమ వద్ద రెండువేల రూపాయల నోట్లు చాలా ఉన్నాయని.. లక్ష రూపాయల విలువైన 500నోట్లు ఇస్తే.. లక్షా 20 వేల విలువైన 2 వేల రూపాయల నోట్లు ఇస్తామంటూ జమీర్.. రియాజ్ ఖాన్ అనే వ్యక్తికి నమ్మబలికాడు. వాస్తవం తెలియని రియాజ్ ఐదులక్షల విలువైన ఐదువందల నోట్లను వారి వద్దకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో పోలీసుల వేషంతో అక్కడికి ఎంట్రీ ఇచ్చిన ముఠాలోని మిగతా సభ్యులు.. జమీర్, రియాజ్ వద్దనున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అంతా కలిసి ఆ ఐదు లక్షలను పంచుకున్నారు.మోసపోయానని రియాజ్ ఖాన్ తర్వతా పోలీసులకు ఫిర్యాదుచేశారు.
గురువారం పట్రపల్లి వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి ఈ ముఠా సభ్యులు పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయం వెలుగుచూసింది. ఈ ముఠా గతంలోనూ ములుగు ప్రాంతంలో ఇదేరకంగా మోసం చేసి ఏడులక్షలు కాజేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు.
మరో కేసులో తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా చోరీలు చేస్తున్న గ్యాంగ్ ఆటకట్టించారు పోలీసులు. ఇటీవల కాలంలో తిరుపతి చుట్టపక్కల ప్రాంతాల్లో చోరీలు వరుసగా జరుగుతున్నాయి. వెంటనే పోలీసులు నిఘా పెంచారు. ఆటోనగర్ బస్టాప్ దగ్గర నలుగురు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు.. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర బంగారాన్ని సీజ్ చేశారు. వీరు ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటుగా మరికొన్ని రాష్ట్రాల్లో చోరీలు చేశారు.. జైలకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత కూడా దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో కూడా వీరిపై కేసులు ఉన్నాయి. వీరిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేశారు పోలీసులు.