కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ.. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత క్యాంపస్‌కు చేరుకున్న ఆయన.. సుమారు గంటపాటు అక్కడే గడిపారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత నెలలో కూడా ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో రాహుల్ ముచ్చిటించారు.
ముఖర్జీ నగర్‌లో రాహుల్ విద్యార్థులతో కలిసి రోడ్డు పక్కన కుర్చీపై కూర్చొని కనిపించారు. ఆ సమయంలో కూడా ఆయన విద్యార్థులను వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీని కలిసిన ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌కు చెందిన మొదటి సంవత్సరం పీహెచ్‌డీ విద్యార్థి దేవేష్ కుమార్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మా దగ్గరకు వచ్చి.. మాతో కలిసి భోజనం చేశారు. ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలతో పాటు యూనివర్సిటీ హాస్టళ్లలో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు అని వెల్లడించారు.
పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఆ కారణంగా ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ శిక్షను సవాలు చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో మే 10న కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా ద్వారా.. జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న వారికి మద్దతు తెలుపుతున్నారు.