అనంతపురం జిల్లా, పామిడి పట్టణంలోని ఎద్దులపల్లి రోడ్డులో నివాసముంటున్న రాజు, ఆదిలక్ష్మి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి పెద్ద కుమారుడు శ్రీనివాసులు గతేడాది పదో తరగతి పరీక్షలు రాసి, ఫెయిలయ్యాడు. ఈసారి సప్లిమెంటరీ రాశాడు. శనివారం వెలువడిన ఫలితాల్లో మళ్లీ ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. రాత్రి విషపు గుళికలు మింగాడు. వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు గమనించి ఆరా తీయడంతో విషపు గుళికలు మింగినట్లు తెలిపాడు. హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.