రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల పట్ల, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ఇచ్చిన జీవో వల్ల, జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జర్నలిస్టులు అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న అనేక సౌలభ్యాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ వైఖరి పట్ల వర్కింగ్ జర్నలిస్టులు అందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఉదయం ఫిర్యాదుల విభాగంలో జాయింట్ కలెక్టర్ కిరణ్ కు జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ ఈశ్వరరావు నాయకత్వంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేసిన జీవోలో లోపాలను జాయింట్ కలెక్టర్కు వివరించారు. తాము నివేదిస్తున్న సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎలక్ట్రానిక్ మీడియాకు జిల్లా కేంద్రంలో నాలుగు అదనపు అక్రిడేషన్లు మంజూరు చేయాలని, ప్రింట్ మీడియా కు సర్కులేషన్ తో సంబంధం లేకుండా మండలానికి ఒక అక్రిడేషన్ ఇవ్వాలని, చిన్న పత్రికలకు అక్రిడేషన్ సంఖ్యను పెంచాలని, జిల్లాలో ప్రింట్ అవుతున్న చిన్న పత్రికలకు నియోజకవర్గానికి నాలుగు అక్రిడేషన్ సదుపాయం కల్పించాలని, డెస్క్ జర్నలిస్టులు అందరికీ సర్కులేషన్ తో పని లేకుండా అక్రిడేషన్స్ ఇవ్వాలని కోరారు.
జిల్లాలు విభజన నేపథ్యంలో బస్సు పాసులు ఉమ్మడి జిల్లాలో జిల్లాలలో చెల్లుబాటు అయ్యేలా ఇవ్వాలని, జర్నలిస్టులు అందరికీ ఏసీ బస్సుల్లో కూడా పాసులు చెల్లెలా ఆదేశాలు ఇవ్వాలని, అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ 3 సెంట్ల ఇంటి స్థలం, మరియు ఇండ్లు మంజూరు చేయాలి, జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు దాడుల నివారణ కమిటీని వెంటనే పునరుద్ధర చేయాలని కోరారు. రైల్వేలో రాయితీలను పునరుద్ధరించాలి, తమిళనాడు తరహాలో జర్నలిస్టులకు పారితోషకం ఇవ్వాలి, కరోనా వల్ల మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. కార్యక్రమంలో పూర్వపు జిల్లా అధ్యక్షులు సనపల నరసింహులు, సామ్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంవి మల్లేశ్వరరావు, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ప్రతినిధులు జయకూమార్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి విజయకుమార్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.