విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న చేలు దగ్ధమైన ఘటన మంగళవారం మండలంలోని అంగకుదురులో చోటు చేసుకుంది. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రూరల్ గ్రామం అంగలకుదురులో పిడపర్తి ప్రదీప్ కుమార్, కూచిపూడి లక్ష్మయ్య, నలుకుర్తి నాగరాజుకు చెందిన మొక్కజొన్న చేలు అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. దాదాపు మూడు ఎకరాల్లో పంట అగ్నికి ఆహుతైంది. గ్రామస్తుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ వైర్లు వేలాడుతున్న కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చునని, ప్రమాదంలో సుమారు రెండున్నర లక్షల మేర ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని అంచనా వేశారు.