గుంటూరు పట్టణంలో ఆదివారం భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధిలోకి తీసుకెళ్లారని కొనియాడారు. దేశంలో భాజపాను ఎదుర్కోగల వ్యక్తి కేసీఆర్ మాత్రమేనన్నారు. ఏపీ ప్రజలు తెదేపా, వైకాపా పాలనతో విసిగిపోయారన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీలు కక్షలు, కార్పణ్యాలతో రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఏపీ ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. వైకాపా, తెదేపాలకు మోదీని ప్రశ్నించే దమ్ములేదన్నారు. ఇక్కడి పార్టీలు మోదీకి గులాంగిరీ చేస్తున్నాయన్నారు. దక్షిణ భారత దేశంలో ప్రధాని కాగల నాయకుడు కేసీఆర్ మాత్రమేనని ఆయన అన్నారు.