తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
వేదాల్లోని విజ్ఞానాన్ని భావితరాలకు తెలియజేయడం కోసం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వేదిక్ హెరిటేజ్ కారిడార్ ప్రారంభించడం అభినందనీయమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. ఎస్వీ వేదిక్ యూనివర్సిటీలో వేదిక్ హెరిటేజ్ కారిడార్‌ను ప్రారంభించారు. వేదాలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే అంతరిక్ష విజ్ఞానం, యాజమాన్య నిర్వహణ, గణితం, ఆరోగ్య సంరక్షణ, యోగ, ఆహారం తీసుకోవాల్సిన విధానం లాంటి దాదాపు 190 అంశాలను కూలంకషంగా వివరించాయన్నారు ఈవో. వీటి గురించి నేటి తరం వారికి తెలియజేసే ప్రయత్నం చేయడం సంతోషకరమన్నారు.
వీటికి సంబంధించి అంశాలతో వేద విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి రచించిన సం ఫాక్ట్స్ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్, ఎస్సేస్ ఆన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనే రెండు పుస్తకాలను ఈవో ధర్మారెడ్డి ఆవిష్కరించారు . వీటిని వేద విశ్వవిద్యాలయం ప్రచురించింది. మిగిలిన అంశాలపై కూడా పుస్తకాలు రచించి అందుబాటులోకి తేవాలని ఆయన వేదిక్ యూనివర్సిటీ విసిని కోరారు.
వేదాలు యజ్ఞయాగాలు నిర్వహించడం, గృహాలలో సంస్కారాలు చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తాయనేది నేటి తరం అభిప్రాయమని తెలిపారు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య రాణి సదాశివ మూర్తి. పూర్వ కాలంలో సమాజానికి కావలసిన అన్ని రకాల అవసరాలు తీర్చడానికి వేదాలు, శాస్రాలు ఎంతగానో ఉపయోగపడినట్లు వివరించారు. ఆధునిక జీవన విధానంలో వేద విజ్ఞానం ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలియజేయడానికే వేదిక్ హెరిటేజ్ కారిడార్ ఏర్పాటు చేశామని తెలిపారు. నిర్ణీత సమయంలో ఎవరైనా వచ్చి ఈ చిత్ర ప్రదర్శనను చూసి, విషయాలను తెలుసుకోవచ్చని చెప్పారు.
అనంతరం ఈవో మ్యాన్ స్క్రిప్ట్స్ ప్రాజెక్టు మాస ప్రగతిపై సమీక్ష జరిపారు. తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని సంస్థలు,వ్యక్తుల వద్ద ఉన్న మ్యాన్ స్క్రిప్ట్స్ ను డిజిటైజ్ చేయడానికి చర్యలు తీసుకుని అవగాహన ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మ్యాన్ స్క్రిప్ట్స్ లను శుభ్రపరచడం, నూనె రాయటం, స్కాన్, డిజిటైజ్ చేసి క్యాటలాగ్స్ రూపొందించి లాకర్లలో భద్ర పరచే పని సంతృప్తి కరంగా సాగుతోందన్నారు . టీటీడీ, సనాతన జీవన ట్రస్ట్ సంయుక్తంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మరింతగా సమాజానికి చేరువ చేసేలా పని చేయాలని చెప్పారు.