మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారని సోమవారం ఉదయం నుంచి ప్రచారం జరిగింది. దీంతో కర్నూలు, కడప జిల్లాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అవినాష్ రెడ్డి కూడా అదే ఆసుపత్రి దగ్గర ఉన్నారు. సీబీఐ అధికారులు అక్కడికే వచ్చి అరెస్టు చేస్తారని ప్రచారం జరగడంతో.. వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున ఆసుపత్రి వద్దకు వచ్చారు. అవినాష్‌కు మద్దతుగా నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో.. సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి మరో లేఖ రాశారు. సుప్రీంలో పిటిషన్ వేసిన విషయాన్ని తెలిపిన అవినాష్.. తన పిటిషన్‌పై మంగళవారం విచారణ ఉందని వివరించారు. తన తల్లి అనారోగ్యం దృష్ట్యా.. ఈనెల 27 వరకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత సీబీఐ విచారణకు అందుబాటులో ఉంటానని ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. అటు సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా.. మెన్షనింగ్ రిజిస్ట్రార్‌ను కలవాలని ధర్మాసనం సూచించింది. ఆ తర్వాత సీబీఐ అధికారులు కర్నూలుకు వచ్చినట్టు తెలుస్తోంది.
కర్నూలులో ఉద్రిక్త పరిస్థితులకు మీడియా కథనాలే కారణం అని.. ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అవినాష్ రెడ్డి సీబీఐకి పూర్తిగా సహకరిస్తున్నారని స్పష్టం చేశారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ వార్తల నేపథ్యంలో.. ఆసుపత్రి వద్దకు వైసీపీ శ్రేణులు వస్తున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తే.. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తవచ్చు అని ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో.. పోలీసులు అలెర్ట్ అయ్యారు.
కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌తో సీబీఐ అధికారులు చర్చలు జరిపారు. అయితే.. డీజీపీ సలహా తీసుకుని నిర్ణయం తీసుకుంటామని సీబీఐ అధికారులకు ఎస్పీ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో కేంద్ర బలగాల సాయంతో అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇటు సీబీఐ, అటు రాష్ట్ర పోలీసులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి.. కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ విజయమ్మ.. సోమవారం సాయంత్రం 5 గంటలకు విశ్వభారతి ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మిని పరామర్శించారు. వైద్యులను అడిగి.. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ కీలక నేతలు విశ్వభారతి ఆసుపత్రికి వెళ్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిని పరామర్శిస్తున్నారు.