ఏపీలో రేషన్ కార్డు బియ్యం కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలను అందించేందుకు రంగం సిద్ధమైంది. జూన్ 1 నుంచి రాయలసీమ జిల్లాల్లో రాగులు పంపిణీ చేయనున్నారు. ముందుగా పైలెట్ ప్రాజెక్ట్ కింద కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రేషన్‌కార్డులపై ఉచిత బియ్యం, సబ్సిడీ కందిపప్పు, చక్కెరతోపాటుగా రాగులను కూడా పంపిణీ చేయనున్నారు. ఉచిత బియ్యానికి బదులు ఒక్కొక్క కార్డుపై గరిష్ఠంగా 3 కేజీల వరకు రాగులను ఉచితంగానే అందజేస్తామని పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. రాయలసీమలోని ఇతర జిల్లాల్లో జూలై నుంచి రాగుల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. దశలవారీగా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకూ విస్తరిస్తామన్నారు. UNO 2023ను చిరుధాన్యాల ఏడాదిగా ప్రకటించగా.. కేంద్రం కూడా చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే అధిక పోషక విలువలు కలిగిన బలవర్థకమైన చిరుధాన్యాలను పేదలకు అందించాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు.
వాస్తవానికి రేషన్‌కార్డుదారులకు రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నంద్యాల జిల్లాలో జొన్నలు పంపిణీ చేస్తున్నారు. వచ్చే నెల నుంచి రాగుల పంపిణీ కూడా చేపట్టనున్నామని వివరించారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 1967 టోల్‌ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఒకవేళ రాగులు వద్దనుకునే కార్డుదారులు యథావిధిగా మొత్తం బియ్యం తీసుకోవచ్చని వివరించారు.
అంతేకాదు స్థానికంగానే రైతుల నుంచి చిరుధాన్యాల ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నారు. వీటిని పీడీఎస్‌లో పంపిణీ చేయనుండగా.. రైతులు కూడా వరికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాలు పండించేలా అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రజలకు బియ్యం కంటే రాగులు, జొన్నలు పౌష్టికాహరంగా భావిస్తోంది. చిరు ధాన్యాలకు అయ్యే ఖర్చే కూడా చాలా తక్కువ.. ఈ చిరు ధాన్యాలను రైతుల నుంచి కొనుగోలు చేస్తే వారికి కూడా మద్దతు ధర దక్కుతుందని భావిస్తున్నారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పీడీఎస్ కింద గోధుమ పిండిని పంపిణీ చేస్తోంది. కిలో రూ.16 చొప్పున కార్డుకు గరిష్టంగా రెండు కిలోలు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ గోధుమ పిండిని సబ్సిడీపై అందిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి దారులకు ఇప్పటి వరకూ బియ్యం, చక్కెర, కందిపప్పు, గోధుమ పిండి, జొన్నలు పంపిణీ చేస్తుండగా.. తాజాగా రాగులు కూడా వచ్చి చేరాయి. రేషన్‌కార్డుదారులు కూడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తంచేస్తున్నారు.