కొందరికి బంగారమంటే ఎంత ప్రేమ వారి ధరించే దానినిబట్టే తెలుస్తోంది. ఇదిలావుంటే వామ్మో.. ఇదంతా బంగారమే..! తిరుమలలో ఓ కుటుంబాన్ని చూసి భక్తులు ఇలాగే ఆశ్చర్యపోయారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ కుటుంబం బంగారంతో చేసిన భారీ ఆభరణాలు ధరించారు. అంతేకాదు, ఆ బంగారు నగలపై పెద్ద పెద్ద బిళ్లలతో వేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ప్రతిమలు ఉండటం మరో విశేషం. మహారాష్ట్రలోని రాట్లం నుంచి వచ్చిన ఈ కుటుంబం శనివారం (జూన్ 3) తిరుమల కొండపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒంటిపై బంగారు నగలతో మెరిసిపోయిన వీరిని భక్తులు ఆసక్తిగా గమనించారు. కొంత మంది తమ సెల్‌ఫోన్లలో వారిని బంధించారు. ఈ కుటుంబాన్ని తమ కెమెరాలో బంధించేందుకు మీడియా ప్రతినిధులు కూడా ఆసక్తి కనబరిచారు. మహారాష్ట్రకు చెందిన ఈ కుటుంబానికి ఇలా వేంకటేశ్వర స్వామి ప్రతిమలతో కూడిన బంగారు ఆభరణాలను ధరించి తిరుమలకు రావడం ఆనవాయితీ అట.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లంకు చెందిన సుభాష్ చంద్ర, సోనీ కుటుంబసభ్యులకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఇలవేల్పు. తమ పూర్వీకుల కాలం నుంచి శ్రీవారినే ఇంటి దైవంగా భావించి పూజిస్తున్నామని వీరు తెలిపారు. అంతేకాదు.. స్వామి, అమ్మవార్ల ప్రతిమలతో తయారు చేయించిన బంగారు ఆభరణాలు ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కూడా వారి పూర్వీకుల నుంచి ఆనవాయితీగా కొనసాగుతోందట. ఆ బంగారు నగలను కూడా తమ పూర్వీకులు తయారు చేయించారని సుభాష్ చంద్ర తెలిపారు.