ఎన్టీఆర్ జిల్లా, మైలవరం పట్టణంలో పెద్దహరిజనవాడలో నాలుగు నివాసాల కూల్చివేతకు పంచాయతీ అధికారులు సిద్ధమయ్యాయి. పోలీస్, రెవిన్యూ అధికారుల సమక్షంలో పేదల ఇళ్ళు పడగొట్టేందుకు యత్నించారు. అయితే పంచాయతీ అధికారులను పేదలు అడ్డుకున్నారు. పేదలకు, అధికారులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఆందోళనకు దిగిన నివాసితులను ఎస్ఐ హరిప్రసాద్ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఇళ్ళు కూల్చివేయడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమ ఇళ్లను కక్ష పూరితంగా కూల్చివేయడంపై నివాసితులు లబోదిబోమంటున్నారు.