గ్యాస్ లీక్ అవ్వడంతో ఊపిరాడక ఓ జంట మృతి చెందిన ఘటన బెంగళూరులోని చిక్కజాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చామరాజనగర జిల్లా గుండ్లుపేటేకు చెందిన చంద్రశేఖర్ (30), బెళగావి జిల్లా గోకాక్ నివాసి సుధా (22) చిక్కజాల పరిధిలోని తరబనహళ్లిలో నివాసం ఉంటున్నారు. స్థానిక గోల్ఫ్ హోటల్లో పని చేస్తుంటారు. విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన వీళ్లు గ్యాస్ గీజర్ ఆన్ చేసి స్నానం చేయడానికి వెళ్లారు. గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు లీక్ అవ్వడంతో ఇద్దరూ సృహతప్పి పడిపోయారు. కొంత సేపటి తర్వాత మరణించారు. మరుసటి రోజు విధులకు రాకపోవడంతో స్నేహితులు రూమ్‌కు వెళ్లి చూడగా విగతజీవులుగా పడి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.