శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడు డాక్టర్ జయరాం, వదిన డాక్టర్ శాంతమ్మ రూ.కోటి విరాళం అందజేశారు. సినీ దర్శకుడు ప్రశాంత్ నీళ్ రూ.25 లక్షలు అందజేశారు. రఘువీరారెడ్డి మరో సోదరుడు చలువమూర్తి కంటి ఆస్పత్రి కోసం 3 ఎకరాల భూమిని ఇస్తామని ప్రకటించారు. నీలకంఠాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ప్రథమ వార్షికోత్సవాన్ని సోమవారం ఆస్పత్రి నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ, మనిషికి కంటి చూపు ప్రధానమని అన్నారు. ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రివారు దాతల సహకారంతో తమ స్వగ్రామంలో కంటి ఆస్పత్రిని ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఎడాది కాలంలో 3,250 మందికి కంటి పరీక్షలు, 120 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించిన డాక్టర్ ఉషను ఆయన అభినందించారు. ఆస్పత్రికి రూ.కోటి విరాళం అందజేసిన తన అన్నావదినలకు రఘువీరా పాదాభివందనం చేశారు. 2025 నాటికి రూ.6 కోట్లతో కంటి ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తామని రఘువీరా ప్రకటించారు.