మద్యం షాపుల్లో రెండు వేల నోట్ల మార్పిడి వ్యవహారంపై ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ సీరియస్ అయ్యింది. ఈ తరహా వ్యవహారాలపై నిఘా పెట్టాలని మద్యం డిపో మేనేజర్లకు కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే షాపుల్లోని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మద్యం నగదు జమ చేసే ఎస్బీఐ బ్రాంచ్ల అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే, రెండు వేల నోట్లు పెద్ద మొత్తంలో జమ చేసే షాపుల వివరాలు తమకు ఇచ్చేలా సంబంధిత బ్రాంచ్ మేనేజర్లకు ఆదేశాలివ్వాలని ఎస్బీఐ ఏజీఎంకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో.. రూ.2వేల నోట్లు తీసుకోవద్దని ఒంగోలు డిపో మేనేజర్ మంగళవారం షాపుల సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.