తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో వారాహి యాత్ర సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అవినీతికి సంబంధించిన ఫైళ్లు చదివి విసుగెత్తిపోతారని, వీళ్లేంట్రా బాబూ ఇన్ని తప్పులు చేశారా అనిపిస్తుందని తెలిపారు. 2019 ఎన్నికల్లో జనసేన ఓడిపోయిన తర్వాత.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి నన్ను కూడా ఆహ్వానించారు. ఆ రోజు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాను. దాంతో ఆ రోజు ఫోన్ లో నేను ముఖ్యమంత్రికి ఒకే ఒక్క మాట చెప్పాను.మేం చాలా పద్దతిగా ప్రతిపక్షంగా ఉంటాం. మీ వ్యక్తిగత విషయాల్లో జోలికి రాకుండా, ఏదైనా విధాన పరమైన నిర్ణయాలపై విమర్శించాల్సి వస్తే మాత్రం విమర్శిస్తాం... మీ వైపు నుంచి తప్పులు లేకుండా చూస్కోండి అని చెప్పాను. కానీ నా కళ్ల ముందే తప్పులు జరుగుతున్నప్పుడు నేను మాట్లాడకుండా ఎలా ఉండగలను? రాజకీయ పక్షంగా అది మా బాధ్యత. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై మాట్లాడి ఇసుక దందాను ఎత్తిచూపానో అప్పటి నుంచి వైసీపీ నన్ను తిట్టని రోజు లేదు. వైసీపీ అంత నీచంగా తయారైంది.