చైనాకు చెందిన ఓ కంపెనీ పెట్టిన షరత్తులో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. పెళ్లైన ఉద్యోగులు తమ జీవిత భాగస్వాములను మోసం చేసినట్లు తేలితే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని చైనాకు చెందిన ఓ కంపెనీ విచిత్రమైన నిబంధనను తీసుకొచ్చింది. ‘అక్రమ సంబంధాలు నిషేధం’ పేరుతో జూన్ 9న జెజియాంగ్‌లోని ఓ సంస్థ ఉత్తర్వులు జారీచేసినట్టు చైనాకు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ నిబంధనలు సంస్థలో పనిచేసే వివాహితులు అందరికీ వర్తిస్తాయని స్పష్టం చేసినట్టు ఆ కథనం పేర్కొంది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది తీవ్ర చర్చకు దారితీసింది.
‘సంస్థ అంతర్గత నిర్వహణను బలోపేతం చేయడంలో భాగంగా కుటుంబం పట్ల విధేయత.. భార్యాభర్తల మధ్య ప్రేమ అనే కార్పొరేట్ సంస్కృతిని సమర్ధించడం, కుటుంబాన్ని మెరుగ్గా రక్షించడం, పనిపై దృష్టి పెట్టడానికి వివాహం చేసుకున్న ఉద్యోగులందరూ వివాహేతర సంబంధాలు వంటి దుర్మార్గపు ప్రవర్తనల నుంచి దూరంగా ఉండాలి’ అని కంపెనీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. అంతేకాదు,‘అక్రమ సంబంధాలు పెట్టుకోరాదు, ఉంపుడుకత్తెలు ఉండరాదు, వివాహేతర సంబంధాలు నెరపరాదు.. విడాకులు తీసుకోరాదు’ ఈ నాలుగు ‘ఎన్’లను అమలు చేస్తున్నట్టు సంస్థ స్పష్టం చేసింది. వీటిని ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
దీనిపై సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. స్థిరమైన, సామరస్యపూర్వకమైన కుటుంబం, పనిలో ఉత్పాదకతను కొనసాగించేలా ఉద్యోగులను ప్రోత్సహించడమే వీటి ఉద్దేశం అని అన్నారు. అయితే, సంస్థ ఈ నిర్ణయానికి తీసుకోడానికి కచ్చితమైన కారణం లేదా ఆఫీసు వ్యవహారాలు ప్రభావితం చేశాయా అనేది స్పష్టంగా తెలియరాలేదు.
ఈ నిబంధనలపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు వీటిని స్వాగతించగా.. మరికొందరు వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతను హరించడమేనని విమర్శిస్తున్నారు. ‘వివాహంలో మోసం చాలా సాధారణం. ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు ఈ చెడు ప్రవర్తనకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఒక సంస్థ చొరవ తీసుకుంది.. ఇది సమాజానికి సానుకూలం.. మన గౌరవానికి ఆ సంస్థ అర్హమైనది’ అని ఒకరు వ్యాఖ్యానించారు.
అయితే, పని చేయలేకపోయినా లేదా సామర్థ్యాలు ఉద్యోగ అవసరాలకు సరిపోలకపోయిన వారిని మాత్రమే చట్టబద్ధంగా తొలగించే అధికారం ఉంటుందని ఓ న్యాయవాది అన్నారు. ‘సంస్థ మార్గదర్శకాల్లో అక్రమ సంబంధాలు నిషేధాన్ని చేర్చినప్పటికీ అది ఇప్పటికీ సిబ్బందిని తొలగించడానికి చట్టబద్ధమైన ఆధారాన్ని కల్పించదు.. ఈ కారణంగా ఒక ఉద్యోగిని తొలగిస్తే చట్టం ప్రకారం వారి హక్కులను పరిరక్షించడానికి చర్యలు తీసుకోవచ్చు. మేము యజమాన్యాలు సరైన విలువలను ప్రోత్సహించాలని సూచిస్తాం.. అయితే వివాహేతర సమస్యల కారణంగా కంపెనీలు ఉద్యోగుల హక్కులను ఉల్లంఘించలేవు’ అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa