ఇటీవల కొత్త తరహా దొంగ తనాలు పెరిగిపోయాయి. దొంగలు ఎంత తెలివి మీరారో చూశారా..! పల్సర్ బైక్పై వచ్చిన ముగ్గురు దొంగలు.. కుమారుడితో కలిసి బైక్పై వెళ్తున్న మహిళ వద్ద నుంచి క్షణాల వ్యవధిలో బ్యాగ్ లాక్కొని వెళ్లిపోయారు. బలంగా లాగడంతో ఆ దాటికి వాహనం పైనుంచి మహిళ కిందపడిపోయారు. కాకినాడలోని బుద్ధవరపు వారి వీధిలో శుక్రవారం (జూన్ 23) ఉదయం 9.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాకినాడలోని బుద్ధవరపు వారి వీధిలో ఓ పెద్దావిడ తన కుమారుడితో కలిసి బైక్పై వెళ్తుండగా.. వెనుక నుంచి మరో బైక్పై వచ్చిన గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఈ దొంగతనం చేశారు. వీరిలో ఇద్దరు యువకులు, ఒక యువతి ఉన్నారు.
బ్యాగ్లో రూ. 5 వేల నగదు, సెల్ ఫోన్ (ఎం.ఐ. 9 మోడల్) ఉందని బాధిత మహిళ తెలిపారు. అక్కడున్న వారు ఏం జరిగిందో అర్థంచేసుకునే లోపే దొంగలు అక్కడ నుంచి పారిపోయారు. ఘటనపై కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఎటు వైపు వెళ్లారో ఆరా తీస్తున్నారు. బ్లూ కలర్ బజాజ్ ఎన్. ఎస్. పల్ సర్ బైక్పై దొంగలు వచ్చినట్లు గుర్తించారు. బైక్పై నెంబర్ ప్లేట్ తొలగించినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ విడుదల చేసిన పోలీసులు.. సదరు వ్యక్తులకు సంబంధించిన సమాచారం తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. సమాచారాన్ని కాకినాడ ఒకటో పట్టణ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ (9440796539)కి తెలుపాల్సిందిగా సూచించారు. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు.