పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పాలని ష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు. అయినా, పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి ఎలా అవుతారని ఎద్దేవా చేశారు. ఇక, ఈసారి పవన్ కళ్యాణ్ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడో ముందుగానే చెప్పాలని సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే 88 మంది ఎమ్మెల్యేలు గెలవాలని.. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయలేనప్పుడు సీఎం ఎలా అవుతారని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. ఏదో కార్యకర్తలను ఉత్సాహపరచడానికే ముఖ్యమంత్రి అవుతానని పవన్ కళ్యాణే చెప్పుకుంటున్నారని.. కానీ, ఆయన వ్యాఖ్యల వెనుక సీరియస్‌నెస్ లేదన్నారు.
పవన్ కళ్యాణ్ మాటలకు, చేతలకు పొంతనే ఉండదని మంత్రి అప్పలరాజు అన్నారు. పవన్ కళ్యాణ్ నిలకడ లేని రాజకీయ నేత అని దుయ్యబట్టారు. అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రహిత ఆంధ్రప్రదేశ్ ఎందుకు చెయ్యాలో పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నందుకా? గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సాగుతున్నందుకా? చరిత్రలో నిలిచిపోయేలా పథకాలు అమలు చేస్తున్నందుకా? ఎందుకు వైసీపీ రహిత ఏపీ చేయాలో చెప్పాలని మండిపడ్డారు.
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు వంతపాడటమే పవన్ కళ్యాణ్ చేసిన మొదటి తప్పుగా మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. చంద్రబాబు వెనుక వెళ్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు కదా.. ఎమ్మెల్యే కూడా కాలేడని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిట్టడమే పవన్ కళ్యాణ్ అజెండా అని మంత్రి అప్పలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.