ఏపీలో కొత్త రాజకీయ పార్టీ అవసరముందని ప్రముఖ సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడిన తరగతి (బీసీ) వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేస్తే ఇప్పటి వరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
గుంటూరు జిల్లా పెదకాకానిలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న విగ్రహాన్ని నటుడు సుమన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సుమన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కులానికొక పార్టీ ఉందని.. బీసీలకు మాత్రం లేదన్నారు. బీసీలకు ప్రత్యేకంగా పార్టీ లేకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చే పార్టీకే మద్దతు ఇవ్వాలని సుమన్ పిలుపునిచ్చారు. మేలు చేసే పార్టీల వద్దకే బీసీలు వెళ్లాలని సూచించారు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చినందుకే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని చెప్పుకొచ్చారు.