శాసనసభ స్పీకర్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. పనులు చేయకుండా ఓట్లు అడగటానికి వెళ్తే జనం తంతారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. శనివారం జరిగిన జడ్పీ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ శాఖపై చర్చ సమయంలో పలువురు జడ్పీటీసీ సభ్యులు తమ పరిధిలోని గ్రామాల్లో పనులు జరగని విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ.. అధికారుల తీరుపై మండిపడ్డారు. ఖరీఫ్‌లో ప్రాజెక్టుల పరిధిలోని శివారు ఆయకట్టు రైతులకు సాగునీరు ఇచ్చే పరిస్థితి కూడా లేదని అన్నారు. ఇలాగైతే రైతులు తిరగబడతారని హెచ్చరించారు.
‘జల్‌జీవన్ మిషన్ పథకంలో భాగంగా గ్రామాల్లో కుళాయిలు, పైపులైన్ పనులు పూర్తిచేసి తాగునీరు సరఫరా చేయాలి. కానీ ఆ పనులు జరగడం లేదు.. ఇలాగైతే రేపు ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు ఓట్లు అడగటానికి ఏ ముఖం పెట్టుకుని వెళ్తాం? పనులు పూర్తిచేయకుండా ఓట్లు అడగడానికి వెళ్తే జనం మమ్మల్ని తంతారు. వాటిని సకాలంలో పూర్తిచేసేలా చర్యలు చేపట్టండి’ అని అధికారులను ఆదేశించారు.
అలాగే, జలవనరుల శాఖపై జరిగిన చర్చలో స్పీకర్ మాట్లాడారు. ఖరీఫ్‌లో జిల్లా ప్రాజెక్టుల పరిధిలోని శివారు ఆయకట్టుకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని, ఇలాగైతే రైతులు తిరగబడతారని వ్యాఖ్యానించారు. ఈలోపే పనులు పూర్తిచేయాలని, లేకపోతే స్పీకర్, మంత్రులు కూడా మిమ్మల్ని కాపాడలేరని అధికారులను హెచ్చరించారు. అంతేకాదు, నిధులు మంజూరు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సభ్యులకు సూచించారు.
![]() |
![]() |