హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో శనివారం అనూహ్యం పరిణామం చోటుచేసుకుంది. కంగ్లీ యావోల్ కన్న లుప్ (కేవైకేఎల్) మైతీ మిలిటెంట్ గ్రూప్ సభ్యులు దాక్కున్న ఇంఫాల్ ఈస్ట్‌లోని ఇథమ్ గ్రామాన్ని శనివారం భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ సమయంలో మహిళల నేతృత్వంలోని అల్లరి మూక సైన్యానికి అడ్డుగా నిలిచింది. దీంతో పౌరుల ప్రాణాలను పణంగా పెట్టకుండా సైన్యం పరిణతి ప్రదర్శించింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న సైన్యం.. మిలిటెంట్లను వదిలిపెట్టింది.
మైతీ మిలిటెంట్ గ్రూప్ 2015లో 6 డోగ్రా యూనిట్‌పై దాడి సహా అనేక దాడుల్లో పాల్గొందని అధికారులు తెలిపారు. ఇథమ్‌లో ప్రతిష్టంభన శనివారం అంతటా కొనసాగింది. మహిళల నేతృత్వంలోని గుంపుపై బలప్రయోగం, ఆ చర్య కారణంగా ప్రాణనష్టం జరగడం వంటి సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కమాండర్ పరిణతి చెందిన నిర్ణయంతో ప్రతిష్టంబన ముగిసిందని చెప్పారు.
గ్రామంలో దాక్కున్నవారిలో డోగ్రా మెరుపు దాడికి ప్రధాన సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మొయిరంగ్థెం తంబ అలియాస్ ఉత్తమ్ కూడా ఉన్నారని తెలిపారు. మహిళల నేతృత్వంలోని 1,500 మంది గుంపు సైన్యాన్ని చుట్టుముట్టి, ముందుకు వెళ్లకుండా అడ్డుకుందని వివరించారు. చట్టం ప్రకారం భద్రతా దళాలు ఆపరేషన్ కొనసాగించడానికి అనుమతించమని అల్లరి మూకకు పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ ఎటువంటి సానుకూల ఫలితం రాలేదు అని అధికారులు పేర్కొన్నారు.
‘మణిపూర్‌లో కొనసాగుతున్న అశాంతి సమయంలో ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని సైన్యం వెనక్కి తగ్గాలని నిర్ణయం తీసుకుంది’ అని అధికారులు చెప్పారు. ఈశాన్య రాష్ట్రంలో మైతీ, కుకీల మధ్య జరగుతున్న హింసలో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మూడు వేల మందికిపైగా గాయపడగా.. 4వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలతో 40 వేల మందికి పైగా ఇళ్లను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.