రష్యా, వాగ్నర్ సైన్యం మధ్య తలెత్తిన సంక్షోభం టీ కప్పులో తుఫాను మాదిరిగా సమసిపోయింది. అయితే, 36 గంటల పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కంటిమీద కునుకు లేకుండా పోయింది. మాస్కో దిశగా సాగుతున్న సైన్యాలను వెనక్కి మళ్లిస్తున్నామని, రష్యన్లు రక్తపాతాన్ని నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాగ్నర్ గ్రూప్ ప్రకటించింది. అయితే, పుతిన్, వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌జెనీ ప్రిగోజిన్ మధ్య మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. 90 దశకంలో ఓ చిన్న రెస్టారెంట్ యజమానిగా ఉన్న ప్రిగోజిన్‌కు పుతిన్‌తో పరిచయం తర్వాత అతడి జీవితమే మారిపోయింది. పుతిన్ పెంచి పోషించి, ఆర్థికంగా బలోపేతం చేసి ఓ కిరాయి సైన్యానికి చీఫ్‌ను చేసింది పుతినే కావడం గమనార్హం.
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న యుద్ధంలోకి వాగ్నర్ గ్రూప్ ఎంట్రీతో పోరాటం స్వరూపం మారిపోయింది. అప్పటివరకు యుద్ధంలో ప్రభావం చూపని రష్యా సైన్యం ఈ కిరాయి బలగాలు ప్రవేశం తర్వాత కొన్ని కీలక విజయాలను దక్కించుకుంది. అయితే, విభేదాలకు అక్కడే బీజం పడింది. ఈ విజయాల ఘనత ఎవరికి దక్కాలన్న విషయంలో సైన్యం, వాగ్నర్ గ్రూప్ మధ్య ఆధిపత్యం పోరు మొదలైంది. ఈ ఏడాది జనవరిలో డొనెట్స్క్‌లో సొలెడార్ ప్రాంతాన్ని వాగ్నర్ సైన్యం ఆక్రమించింది. దీనిని తమ ఘనతగా రష్యా సైన్యం ప్రకటించుకోవడం ప్రిగోజిన్‌కు ఆగ్రహానికి కారణమైంది.
ఆ సమయంలో ఆయన రష్యా రక్షణ శాఖ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. అప్పటి నుంచి మొదలైన విబేధాలు తీవ్రస్థాయికి చేరాయి. ఒకానొక సందర్భంలో రష్యా కమాండర్లను చవటలని కూడా ప్రిగోజిన్ అభివర్ణించారు. సొంత భూభాగాన్ని కూడా రష్యా సైన్యం కాపాడుకోలేదని విమర్శించారు. గత నెలలో బఖ్‌ముత్‌ను స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ విభేదాలు మరింత ముదిరాయి.
ప్రాణాలకు తెగించి పోరాడుతున్న తమ సైనికులకు ఆయుధాలు అందజేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఇందుకు రక్షణ మంత్రి సెర్గీ షోయిగునే కారణమని ప్రిగోజిన్ దుయ్యబట్టారు. యుద్ధంలో చనిపోయిన తన అనుచరుల మృతదేహాల పక్కనే నిలబడి రష్యా రక్షణ మంత్రిపై విమర్శలు చేస్తూ ప్రిగోజిన్ వీడియోలను విడుదల చేశారు. దేశం కోసం పోరాటం చేస్తున్న తమను అంతం చేయడానికి షోయిగు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో ప్రైవేటు సైన్యాలను నియంత్రించేందుకు మాస్కో తీసుకొచ్చిన కొత్త చట్టం కూడా దీనికి ఆజ్యం పోసింది.
ఈ చట్ట ప్రకారం.. రష్యా సైన్యంతో కలిసి స్వచ్ఛందంగా పోరాటం చేస్తున్న ప్రైవేటు సైన్యాలన్నీ రక్షణ శాఖ పరిధిలోకి వస్తాయి. ఈ మేరకు కాంట్రాక్టులపై సంతకం చేయాలని రష్యా రక్షణ మంత్రి షొయిగు ఉత్తర్వులు జారీ చేయడం ప్రిగోజిన్‌కు మరింత ఆగ్రహం తెప్పించాయి. సైనిక వ్యూహాలనే సరిగా అమలు చేయలేని వ్యక్తి చెబుతున్న కాంట్రాక్టులపై సంతకం చేయమని తెగేసి చెప్పారు. ఇలా పెరిగిన అవిశ్వాసం, అనుమానాలే చినికి చినికి తిరుగుబాటుకు దారితీశాయి. ఇక, తిరుగుబాటును విరమించిన ప్రిగోజిన్.. బెలారస్‌కు వెళ్లిపోతున్నట్టు ప్రకటించారు. తమ సైన్యాలు కూడా యుద్ధ భూమికి వెళతాయని వెల్లడించారు. మరోవైపు, వాగ్నర్ గ్రూప్‌పై అన్ని క్రిమినల్ చర్యలను ఎత్తివేస్తున్నట్టు పుతిన్ యంత్రాంగం తెలిపింది.