ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తోన్న రష్యా అధినేతకు ఊహించని రీతిలో అతడు పెంచి పోషించిన సైన్యం వాగ్నర్ గ్రూప్ సాయుధ తిరుగుబాటు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రోస్తోవ్, ఒరోజెన్ నగరాలను స్వాధీనం చేసుకుని మాస్కో దిశగా సాగుతున్న వాగ్నర్ సేనలు హఠాత్తుగా తమ ప్రయాణాన్ని విరమించుకున్నాయి. రష్యన్ల రక్తపాతాన్ని నివారించేందుకు తిరుగుబాటును ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించాయి. నాటకీయ పరిణామాల మధ్య తిరుగుబాటుదారులు తమ నిర్ణయాన్ని మార్చుకోవడంతో రష్యన్లు ఊపిరి పీల్చుకున్నారు.
కీలక నగరాలు రోస్తోవ్, ఓరోజెన్‌లను స్వాధీనం చేసుకున్న తిరుగుబాటు వాగ్నర్ సేనలు మాస్కో దిశగా సాగుతుండగా.. తమ పురోగమనాన్ని నిలిపివేస్తున్నట్టు ఆ గ్రూప్ అధిపతి యెవ్‌జెనీ ప్రిగోజిన్ ప్రకటించారు. రష్యన్ల రక్తపాతాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, తాము తిరిగి ఉక్రెయిన్‌లోని యుద్ధ క్షేత్రాలకు వెళుతున్నట్టు వెల్లడించారు. అయితే, ప్రిగోజిన్, రష్యా మధ్య సయోధ్యకు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వం వహించినట్టు ఆ దేశం ప్రకటించింది. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం ప్రకటన చేసింది.
క్రెమ్లిన్‌తో ఒప్పందం కుదిరిందని, ప్రిగోజిన్ పై ఉన్న అన్ని ఆరోపణలను ఎత్తివేయడానికి పుతిన్ అంగీకరించారని ధ్రువీకరించింది. ‘బెలారస్ అధ్యక్షుడు తనకు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా పరిస్థితిని చక్కదిద్దారు.. రష్యా అధ్యక్షుడ పుతిన్ సమన్వయంతో వాగ్నెర్ గ్రూప్ చీఫ్ యెవ్‌జెనీ ప్రిగోజిన్‌తో చర్చలు జరిపారు’ అని బెలారస్ అధ్యక్ష భవనం ఓ ప్రకటనలో తెలిపింది.
‘చర్చలు ఒక రోజంతా కొనసాగాయి. ఫలితంగా, రష్యా భూభాగంలో రక్తపాతాన్ని నివారించాలని ఒక ఒప్పందానికి వచ్చారు. రష్యాపై వాగ్నర్ సాయుధ తిరుగుబాటును ఆపడానికి, ఉద్రిక్తతలు తగ్గించడానికి తదుపరి చర్యలు తీసుకోవాలన్న అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో చేసిన ప్రతిపాదనకు ప్రిగోజిన్ అంగీకరించారు’ అని పేర్కొంది. అంతకు ముందు ఉక్రెయిన్‌లో యుద్ధానికి కారణమైన అవినీతిపరులు, అసమర్థులైన రష్యన్ కమాండర్లను తొలగించేందుకు తాము మాస్కో దిశగా మార్చ్ చేపట్టామని ప్రిగోజిన్ చెప్పారు.
దీనిపై పుతిన్ స్పందిస్తూ.. రష్యా ఉనికికే ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మేము మా ప్రజల జీవితాలు, భద్రత కోసం.. సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం కోసం వెయ్యేళ్ల చరిత్ర కలిగిన రష్యాగా కొనసాగే హక్కు కోసం పోరాడుతున్నాం’ అని ఆయన అన్నారు.