మహారాష్ట్ర సీఎం ఎవరు అనే ఉత్కంఠకు ఇంకా తెరపడటం లేదు. బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి.. బంపర్ మెజార్టీతో మహారాష్ట్రలో విజయం సాధించింది. ఫలితాలు వెలువడి 4 రోజులు గడుస్తున్నా.. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేది ఎవరూ అనేది తేలడం లేదు. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నేటితో (మంగళవారం) ముగియనుండటంతో.. బుధవారం నుంచి రాష్ట్రపతి పాలన విధిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే రాష్ట్రపతి పాలన విధించకుండా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లను బుజ్జగించి.. వారిద్దరికీ డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి.. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను చేయాలని బీజేపీ హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తోంది. అయితే దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం చేసేందుకు అజిత్ పవార్ మద్దతు తెలపగా.. ఏక్‌నాథ్ షిండే మాత్రం సీఎం సీటు కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిష్ఠంభన వీడటం లేదు.
అయితే అసెంబ్లీ గడువు ముగిసేలోపు.. కొత్త ప్రభుత్వం ఏర్పడి.. సీఎం ప్రమాణ స్వీకారం తప్పనిసరి కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరకపోయినా.. రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదని పేర్కొంటున్నారు. ఇందుకు గతంలో జరిగిన కొన్ని పరిస్థితులను గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ గడువు తీరిన తర్వాత కూడా కొత్త ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాలు ఉన్నాయని వివరిస్తున్నారు. దీంతో మంగళవారం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయకపోయినా.. రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
దీంతో మహారాష్ట్ర మంగళవారం అర్ధరాత్రి తర్వాత రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుండగా.. నవంబర్ 26వ తేదీలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కచ్చితమైన నిబంధన భారత రాజ్యాంగంలో లేదని చెబుతున్నారు. అయితే గతంలో అసెంబ్లీ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని.. చరిత్ర చూస్తే తెలుస్తోంది.
2004 అక్టోబర్ 19వ తేదీన మహారాష్ట్ర 10వ అసెంబ్లీ పదవీకాలం ముగిసింది. అయితే కొత్త ముఖ్యమంత్రి 2004 నవంబర్ 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఇక 11వ శాసనసభ పదవీకాలం 2009 నవంబర్ 3వ తేదీన ముగియగా.. 12వ శాసనసభకు కొత్తగా ఎన్నికైన సీఎం 2009 నవంబర్ 7వ తేదీన ప్రమాణం చేశారు. అనంతరం 12వ అసెంబ్లీ పదవీకాలం 2014 నవంబర్ 8వ తేదీతో ముగిసింది. ఆ తర్వాత 13వ అసెంబ్లీకి కొత్త ముఖ్యమంత్రిగా 2014 అక్టోబర్ 31వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 13వ అసెంబ్లీ పదవీకాలం 2019 నవంబర్ 9వ తేదీతో ముగియగా 14వ అసెంబ్లీకి కొత్త సీఎం 2019 నవంబర్ 28వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే గత 2 దశాబ్దాలుగా మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలను చూస్తే.. మంగళవారం అర్ధరాత్రిలోపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయకపోయినా రాష్ట్రపతి పాలన విధించరు అనే విషయం అర్థం అవుతోంది.