ఓ వ్యక్తి సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి అగ్నిప్రమాదంలో ఆమె మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు అసలు గుట్టును రట్టు చేశారు. హర్యానాలోని సోనిపట్‌లో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 25న సివిల్ లైన్స్ ఏరియాలోని రిషి కాలనీలో నివసిస్తున్న సరిత ఇంట్లో మంటలు వ్యాపించాయి. కాలిన ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా ఆమెను కత్తితో పొడిచి చంపి శరీరానికి నిప్పంటించినట్లు తేలింది. మృతురాలు సరిత సోదరుడి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చిన్ననాటి స్నేహితురాలైన ఆమెతో ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్న వ్యాపారి ఉప్కార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మరోవైపు భర్త నుంచి సరిత విడిపోవడంతో వివాహితుడైన ఉప్కార్ ఆమెతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ విషయం అతడి భార్యకు కూడా తెలుసని అన్నారు. అయితే కుటుంబ కలహాల వల్ల సరితను కత్తితో పొడిచి హత్య చేశాడని, ఆ తర్వాత ఆమె శరీరానికి నిప్పుపెట్టాడని చెప్పారు. ఆ మంటల్లో ఇల్లు కాలిపోవడం వల్ల ఆమె చనిపోయినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని పోలీస్ అధికారి వెల్లడించారు.