మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించి, అధికారాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, కొత్త ప్రభుత్వాన్ని నడిపే సారథి ఎవరు? అనేది మాత్రం ఇంకా సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. మహారాష్ట్రలోని 14వ అసెంబ్లీ పదవీకాలం మంగళవారం (నవంబరు 26)తో ముగియనుండగా షిండే పదవి నుంచి దిగిపోయారు. అయయితే, ముఖ్యమంత్రిపై స్పష్టత వచ్చి, ఆయన ప్రమాణస్వీకారం చేసేవరకు ఆపధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని షిండేను గవర్నర్ కోరారు.
మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో మహాయుతి 234 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి 48 సీట్లకే పరిమితమైంది. ఈనేపథ్యంలో సీఎం అభ్యర్ధిగా తమ నేతే ఉండాలని బీజేపీ భావిస్తోంది. అయితే, షిండేనే సీఎంగా కొనసాగించాలని శివసేన పట్టుబడుతుంది. దీంతో మహారాష్ట్ర నూతన సీఎంగా ఎవరు స్వీకరిస్తారనే దానిపై స్పష్టత కొరవడింది.
మహారాష్ట్రలో ప్రస్తుత అసెంబ్లీకి నేటితో గడువు తీరిపోనుండగా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారని ప్రచారం జరిగింది. కానీ, దీనిని అధికారులు కొట్టిపారేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబరు 23 రావడంతో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల జాబితాను ఎన్నికల కమిషన్ అధికారులు ఈ నెల 24న గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు అందజేశారు. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టం 73వ సెక్షన్ ప్రకారం 15వ అసెంబ్లీ ప్రారంభమైనట్లేనని అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం ఇక రాష్ట్రపతి పాలనకు ఆస్కారం ఉండకపోవచ్చని తెలుస్తోంది. సీఎం పదవిపై ఢిల్లీలో జరుగుతున్న మంతనాలు కొలిక్కి వచ్చి, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మరో మూడు, నాలుగు రోజుల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, సీఎం పదవి విషయంలో అటు బీజేపీ, ఇటు శివసేన ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.