మరికాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా.. పెళ్లి కొడుకు చేసిన పనికి.. ఆ పెళ్లి పెటాకులు అయిపోయింది. పెళ్లి చేసుకునేందుకు ఫంక్షన్ హాల్‌కు వచ్చిన ఆ వరుడు.. తన రూంలో ఇద్దరు యువతులతో మద్యం, సిగరెట్ తాగుతూ.. పెళ్లి కుమార్తె సోదరుడికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వెంటేనే పెళ్లి కొడుకు చేస్తున్న నిర్వాకాన్ని.. కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పెళ్లి కూతురు.. ఆ పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ క్రమంలోనే రెండు కుటుంబాల మధ్య చెలరేగిన పంచాయతీ కాస్తా.. పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది.
కాన్పూర్‌లోని దామోదర్ నగర్లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు అయింది. బర్రా వరల్డ్ బ్యాంక్ ప్రాంతానికి చెందిన హిమన్షు అనే ఆర్కెస్ట్రా వర్కర్‌కు పెళ్లి కుదిరింది. దామోదర్ నగర్‌కు చెందిన ఓ యువతితో పెళ్లి కుదిర్చారు. నవంబర్ 24వ తేదీన(ఆదివారం) రాత్రి దామోదర్ నగర్‌లోని పెళ్లి మండపానికి హిమన్షు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. పెళ్లి పనుల్లో భాగంగా వధూవరులు దండలు కూడా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే బట్టలు మార్చుకునేందుకు వరుడు.. తన రూంకు వెళ్లాడు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి తర్వాత.. వధువు సోదరుడు ఆ రూంకు వెళ్లాడు. అక్కడ జరిగే ఘటన చూసి అతడు షాక్ అయ్యాడు. ఆ రూంలో వరుడు.. అతని ఇద్దరు మహిళా స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ.. సిగరెట్ తాగుతూ కనిపించాడు.
దీంతో ఆ విషయం మొత్తాన్ని ఆ వధువు సోదరుడు బయటికి వెళ్లి.. తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. వెంటనే వాళ్లంతా వచ్చి గొడవ పెట్టుకున్నారు. ఆ తర్వాత మధ్యవర్తిత్వం చేసి.. పెళ్లి జరిపించేలా కుటుంబ సభ్యులు చర్చలు జరిపారు. ఇక పెళ్లి కూతురు అయితే తనకు ఈ పెళ్లి వద్దని తెగేసి చెప్పింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ఘర్షణ మరింత ముదిరింది. దీంతో రెండు వర్గాలు కలిసి.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.