ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారం చేపడితేనే ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ అని శృంగవరపుకోట మాజీ శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి అన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం ఇంచార్జ్ పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం గాజువాక నుండి ప్రారంభమైన భవిష్యత్తు గ్యారెంటీ చైతన్య రథయాత్రలో ఆమె పాల్గొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కైవసం చేసుకోవడం ఖాయమని, తెదేపా అధికారం చేపట్టిన తర్వాత చేపట్టబోయే సంక్షేమం, అభివృద్ధి గురించి ఈ సందర్భంగా ఆమె ప్రజలకు వివరించారు. చంద్రబాబు ప్రకటించిన తొలి మేనిఫెస్టో ప్రజాదరణతో పాటు మహిళాధరణ పొందుతోందని ఆమె తెలిపారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని, ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు విసుగు చెందుతున్నారని ఈ సందర్భంగా ఆమె వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ రాంప్రసాద్ తదితర ప్రముఖ తెదేపా శ్రేణులు పాల్గొన్నాయి.