పొదలకూరు పట్టణంలో బోగోలు కృష్ణారెడ్డి కల్యాణ మండపంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దిశానిర్ధేశం చేశారు. ఈనెల 30, వచ్చే నెల 1, 2తేదీల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర జరుగుతున్న నేపథ్యంలో గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ యువగళం పాదయాత్రను టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజాగళంగా మార్చారని కొనియాడారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా లోకేష్ ముందుకు సాగుతున్నారన్నారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను ఎండగడుతున్నారని తెలిపారు. పాదయాత్రకు ప్రభుత్వం, పోలీసులు అడుగడుగునా అవాంతరాలు సృష్టించినా ప్రజలు విజయవంతం చేశారని, ‘బాబు రావాలి.. రాష్ట్రం బాగుపడాలి’ అని అందరూ భావిస్తున్నారని పేర్కొన్నారు.