ఎంటిఎంసి పరిధిలోని తాడేపల్లి 6వ వార్డులో పైపు లైన్ల నిర్మాణంలో అలసత్వం వల్ల ప్రజలు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో కధనాలు వెలువడ్డాయి. దీంతో స్పందించిన మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ ఎంటిఎంసి కమిషనర్ శారదాదేవికి ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ బిక్కిరెడ్డి శివారెడ్డి 6వ వార్డులో ఉన్న పైపులైన్లను శనివారం పరిశీలించారు.
ఎంటిఎంసి ఇంజనీరింగ్ సిబ్బందితో మాట్లాడి రెండు రోజుల్లో పైపులైను నిర్మాణం పూర్తి చేసి 6వ వార్డు ప్రజలకు సురక్షిత మంచినీటిని అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షులు ముదిగొండ ప్రకాష్, 6వ వార్డు మాజీ కౌన్సిలర్ వేముల లక్ష్మి రోజా తదితరులు పాల్గొన్నారు.