ఎట్టకేలకు నంది అవార్డులను ఇచ్చేందుకు ఏపీ సర్కార్ ముందుకొచ్చింది. ఇదిలావుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నంది అవార్డులు ఇచ్చే బాధ్యతలను తనకు అప్పగించారని.. ఉత్తములు, అర్హులకు మాత్రమే ఆ అవార్డులను అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి వెల్లడించారు. ఒకేసారి డ్రామా, టీవీ, సినిమా రంగాలకు అవార్డులు ఇవ్వడం సాధ్యం కాదని.. మొదటిగా పద్య నాటకాలకు అందించి, ఆ తర్వాత మిగతా రంగాలకు అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో 1998 నుంచి 2004 వరకు నంది అవార్డులు ఉండేవని.. కానీ, అవి కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం అయ్యాయని చెప్పారు.
గత తెలుగు దేశం పార్టీ హయాంలో నంది అవార్డులు ఇస్తామని చెప్పి రద్దు చేశారని పోసాని కృష్ణమురళి అన్నారు. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ నంది అవార్డులు ఇవ్వాలని భావిస్తున్నారని చెప్పారు. ఆ బాధ్యతను తనకు అప్పగించారని వెల్లడించారు. ఈసారి నంది అవార్డులను నిజాయితీగా, వివక్ష లేకుండా అర్హులకు మాత్రమే ఇస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా ఉచితంగా షూటింగ్ చేసుకోవచ్చని.. స్టూడియోలు కడితే సహకరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. సినిమా రంగం అభివృద్ధి కోసం సీఎం జగన్ ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని పోసాని అన్నారు.
ఎఫ్‌డీసీ ఎండీ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. నాటక రంగానికి నంది అవార్డుల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని, దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజులు గడువు ఉంటుందని చెప్పారు. ఉపసంహరణకు నెల రోజులు గడువు ఇస్తున్నామని.. 5 క్యాటగిరీల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పద్య, సాంఘిక నాటకాలు, పిల్లల నాటకాలు, యువ నాటికలు అన్నీ కలిపి మొత్తం 73 అవార్డులు ఇస్తామని విజయ్ కుమార్ తెలిపారు.