ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణా రెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 05, 2023, 06:50 PM

ఏపీలో రాజకీయ దుమారం రేపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ ఆయన వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కృష్ణా రెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్‌ చేసే అధికారం తనకు కూడా ఉన్నట్లు ఆదేశాలు ఇవ్వాలన్న కృష్ణా రెడ్డి అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.


వివేకా హత్య కేసులో జోక్యానికి సిద్ధంగా లేమని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. వాద, ప్రతివాదుల అభిప్రాయాలు హైకోర్టు ముందే చెప్పుకోవాలని తేల్చిచెప్పింది. దీనిపై తమ అభిప్రాయాలతో సంబంధం లేకుండా హైకోర్టు స్వతంత్రంగా తగిన నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో గురువారం లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇస్తామని తెలిపింది.


ఇదిలావుంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయాన్ని ముందుగా గుర్తించి అందరికీ సమాచారం చేరవేసిందీ, వివేకా రాశారని చెబుతున్న లేఖను అల్లుడు రాజశేఖర్ రెడ్డికి అందించిందీ పీఏ కృష్ణారెడ్డి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుని పలుమార్లు ప్రశ్నించింది. అయితే ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వివేకా హత్య గురించి లోకానికి ముందుగా తెలియజేసిన తనను బాధితుడిగా పరిగణించాల్సింది పోయి నిందితుడిని చేస్తున్నారంటూ కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa