మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల గురించి సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల దాకా ఎన్నో విమర్శలు, ఆందోళనలు జరుగుతున్నాయి. పెట్రోల్ ధర సెంచరీ దాటగా.. డీజిల్ ధర కూడా సెంచరీకి చేరువలో ఉంది. అయితే పెట్రో ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ పేలడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు.. ఇలా ఎన్నో చూశాం. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ.. మన దేశంలో మాత్రం పెట్రో ధరలు తగ్గడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే దేశంలో ఇంధన ధరలపై తాజాగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో రూ.15 కే లీటర్ పెట్రోల్ లభిస్తుందని పేర్కొన్నారు.
మన దేశంలో పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలపై ఆధారపడి నడిచే వాహనాలే ఎక్కువ. గత కొంత కాలంగా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఊహించిన స్థాయిలో వాటి వినియోగం ఉండటం లేదు. అయితే పూర్తిగా పెట్రోల్, డీజిల్ కాకుండా, ఇథనాల్‌తో నడిచే వాహనాలను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా చర్యలు చేపడుతూనే ఉంది. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి.. దాని ద్వారా నడిచే వాహనాల కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. వీటిని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం.. ఆటోమొబైల్ కంపెనీలకు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉంది. ఇథనాల్, కరెంట్ ఆధారంగా నడిచే వాహనాలు పెరిగితే భవిష్యత్‌లో పెట్రోల్ ధరలు దిగి వస్తాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. లీటర్ పెట్రోల్ రూ. 15 కే అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
అయితే ఈ ఇథనాల్ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రైతులు ఉత్పత్తి చేసే ఇథనాల్ సరిపోతుందని వెల్లడించారు. దీని ద్వారా కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా.. రూ.16 లక్షల కోట్ల భారీ దిగుమతుల వ్యయాన్ని రైతుల కుటుంబాలకు మళ్లించవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఇంధనాల స్థానంలో 60 శాతం ఇథనాల్, 40 శాతం విద్యుత్‌ను ఉపయోగిస్తే పెట్రోల్ ధర రూ. 15 కే దిగి వస్తుందని నితిన్ గడ్కరీ తెలిపారు. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిన ఓ బహిరంగ సభకు హాజరైన నితిన్ గడ్కరీ ఇంధన ధరల పెరుగుదల.. లీటర్ పెట్రోల్ రూ.15 కు ఎలా వస్తుందో వివరించారు.