మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మహా వికాస్ ఆఘాఢీలో ఉన్న ఎన్సీపీలో చీలిక తెచ్చిన అజిత్ పవార్.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి.. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన - బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఈ పరిణామంతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే అటు.. అజిత్ పవార్.. ఇటు శరద్ పవార్.. తమ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో బలప్రదర్శన చేపట్టారు. ఈ బల ప్రదర్శనలో పార్టీలో అధిక శాతం మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వైపు వెళ్లడంతో శరద్ పవార్ వర్గానికి ఎదురు దెబ్బ తగిలింది. ఇదే అదనుగా అజిత్ పవార్ ఎన్నికల కమిషన్ వద్దకు చేరారు.
ఎన్సీపీలో తలెత్తిన తాజా సంక్షోభం ఎన్నికల కమిషన్ వద్దకు చేరుకుంది. బుధవారం నిర్వహించిన బల ప్రదర్శనలో తమ వైపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్న అజిత్ పవార్.. పార్టీ తమదేనని వాదిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ను సంప్రదించిన అజిత్ పవార్ వర్గం.. ఎన్సీపీ పేరు, గుర్తు తమకే కేటాయించాలని కోరుతున్నారు. పార్టీలో తమ వర్గానికే అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్ పవార్ వర్గం చెబుతోంది. అజిత్ పవార్ వర్గానికి ఉన్న 40 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల అఫిడవిట్లను ఈసీకి సమర్పించింది. దీంతో అసలైన ఎన్సీపీ తమదేనని.. పార్టీ గుర్తు, పేరు తమకే కేటాయించాలని అజిత్ పవార్ వర్గం పట్టుబడుతోంది.
బుధవారం ఎన్సీపీలోని శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం.. బల ప్రదర్శనకు దిగాయి. ఎంఈటీ బాంద్రాలో అజిత్ పవార్ వర్గం సమావేశం నిర్వహించింది. తన వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నేతలు అందరూ పాల్గొనాలని అజిత్ పవార్ పిలుపునిచ్చారు. ఈ భేటీకి 29 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు హాజరు అయ్యారు. మరోవైపు ముంబయిలోని వైబీ చౌహాన్ ఆడిటోరియంలో శరద్ పవార్ వర్గం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి 14 మంది ఎమ్మెల్యేలతోపాటు ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు, నలుగురు ఎంపీలు హాజరయ్యారు. అయితే ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్ పవార్ వర్గానికి 29 మంది.. శరద్ పవార్ వర్గానికి 14 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. అయితే మరో 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఇరువర్గాల సమావేశాలకు దూరంగా ఉన్నారు.