తనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కావాలని పార్టీ బలప్రదర్శన సందర్భంగా అజిత్ పవార్.. తన మనసులో మాటను బయట పెట్టారు. అయితే ఇదే సమయంలో శరద్ పవార్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. శరద్ పవారే తమ నేత అని.. గురువు అని.. దేవుడని అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. 2004 లో కాంగ్రెస్ కంటే మహారాష్ట్రలో ఎన్సీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని.. ఆ సమయంలో ముఖ్యమంత్రి పదవి అవకాశం తమ పార్టీకి వచ్చినా వదిలేశామని అజిత్ పవార్ అన్నారు. తనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందని.. రాష్ట్ర సంక్షేమం కోసం అవసరమైన కొన్ని ప్రణాళికలు తన దగ్గర ఉన్నాయని.. ఈ సందర్భంగా తన మనసులోని మాటను అజిత్ పవార్ వెల్లడించారు. ఇదే సమయంలో శరద్ పవార్‌పై ఛలోక్తులు విసిరారు. బీజేపీలో నాయకులు 75 ఏళ్లకే పదవీ విరమణ తీసుకుని రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం 83 ఏళ్ల శరద్ పవార్ రాజకీయాల వదిలేసి విశ్రాంతి తీసుకోవాలని పరోక్షంగా పేర్కొన్నారు.
మహారాష్ట్రలో చీలిక తెచ్చిన ఎన్సీపీలో శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం బుధవారం పోటా పోటీగా బల ప్రదర్శనకు దిగాయి. అయితే అజిత్ పవార్ చీలికతో కకావికలమైన ఎన్సీపీలో బుధవారం కీలక పరిణామానలు జరిగాయి. ఓ వైపు.. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్.. తిరుగుబాటు నేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌లు పోటా పోటీగా బల ప్రదర్శన నిర్వహించారు. ఈ ఎమ్మెల్యేల బల ప్రదర్శనలో బాబాయ్‌పై అబ్బాయ్ పైచేయి సాధించారు. అజిత్ పవార్ ఏర్పాటు చేసిన బల ప్రదర్శనకు 29 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే తమకు మొత్తం 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్ పవార్ స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఏర్పాటు చేసిన సమావేశానికి కేవలం 14 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. అయితే ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. మరో 10 మంది ఎమ్మెల్యేలు అటు.. శరద్ పవార్ వైపుగానీ.. ఇటు అజిత్ పవార్ వైపు గానీ కాకుండా తటస్థంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇరు వర్గాలు నిర్వహించిన బలప్రదర్శనలకు హాజరు కాలేదని మహారాష్ట్ర రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.