ఇటీవల విడుదలైన ఆదిపురుష్ సినిమా ఎన్నో వివాదాలకు కారణమైంది. ఇక ఆ సినిమాలో హనుమాన్ పాత్రతో చెప్పించిన డైలాగులపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఎట్టకేలకు చిత్ర యూనిట్ దిగి వచ్చి.. కొన్ని డైలాగులను మార్చి వాటి స్థానంలో కొత్త డైలాగులను చేర్పించింది. అయితే ఈ సినిమాలో హనుమాన్ పాత్ర పోషించిన యాక్టర్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆదిపురుష్ సినిమా.. అనంతరం వచ్చిన కాంట్రవర్సీలతో క్రేజ్ రావడంతో అందులో హనుమాన్ పాత్రి పోషించిన నటుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు.
ఆదిపురుష్ సినిమాలో హనుమాన్ పాత్ర పోషించిన నటుడి పేరు విక్రమ్ మస్తాల్. ఈ సినిమాలో ఆయన పేరు భజరంగ్. ఈయన స్వస్థలం మధ్యప్రదేశ్. విక్రమ్ మస్తాల్.. మధ్యప్రదేశ్ బాడీ బిల్డర్‌గా పేరుగాంచాడు. అందుకే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాలో పవర్‌ఫుల్ క్యారెక్టర్ అయిన హనుమాన్ పాత్రకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు విక్రమ్ మస్తాల్ మొగ్గు చూపారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, మధ్యప్రదేశ్ ప్రస్తుత పీసీసీ చీఫ్ కమల్‌నాథ్ సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి.. ఆ పార్టీలో చేరినట్లు.. చేరిక అనంతరం విక్రమ్ మస్తాల్ వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చేసిన అభివృద్ధి పనులు తనను రాజకీయాల్లోకి రావడానికి ప్రోత్సాహం అని విక్రమ్ మస్తాల్ పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీయే అని బలంగా విశ్వసించి.. ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని.. అందుకే తనతోపాటు రాష్ట్రంలోని చాలా మంది హస్తం పార్టీ వైపు చూస్తున్నారని విక్రమ్ మస్తాల్ చెప్పారు.
అయితే విక్రమ్ మస్తాల్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దేశ అభివృద్ధి కాంగ్రెస్ వల్ల కాదని.. అది కేవలం బీజేపీతోనే సాధ్యమని మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు వెల్లడించారు. విక్రమ్ మస్తాల్ నిజంగా దేశ అభివృద్ధి కోరుకుంటే బీజేపీలో చేరి ఉండాల్సింది అని సూచన చేశారు.
అయితే ఇటీవల విడుదలైన ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు బాగానే రాబట్టినట్లు సినిమా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సినిమాలో హనుమంతుడితో చెప్పించిన డైలాగ్‌లు కొంత వివాదానికి తెర తీశాయి. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత చిత్ర యూనిట్.. హనుమంతుడికి సంబంధించిన కొన్ని డైలాగ్‌లను తొలగించి వాటి స్థానంలో మార్పులు చేసింది. హనుమాన్ కోసం ప్రతీ థియేటర్‌లో ఒక సీటును ప్రత్యేకంగా కేటాయించడం ఈ సినిమాలో మరో ప్రత్యేకత.