భారత అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా మీడియా ప్రశంసలు కురిపించింది. స్పేస్ టెక్ స్టార్ట్ అప్‌ల లో వాయువేగంతో వృద్ధి చెందుతున్న భారత్.. చైనాకు ధీటుగా దూసుకెళ్తోందని న్యూయార్క్ టైమ్స్ కితాబిచ్చింది. ‘1963లో మొదటి రాకెట్‌ను ప్రయోగించినప్పుడు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అత్యాధునిక సాంకేతికతను అనుసరిస్తున్న పేద దేశం.. సైకిల్ ద్వారా లాంచ్‌ప్యాడ్‌కు చక్రాలు వేసి భూమికి 124 మైళ్ల ఎత్తులో ఒక చిన్న పేలోడ్‌ను చేర్చింది. కేవలం అమెరికా, సోవియట్ యూనియన్ నీడనే ఉండిపోలేదు. నేటి అంతరిక్ష పోటీలో భారతదేశం చాలా కచ్చితంగా అడుగులు వేసింది’ అని ప్రశంసించింది.
‘ది సర్ప్రైజింగ్ స్ట్రైవర్ ఇన్ ది వరల్డ్స్ స్పేస్ బిజినెస్’ శీర్షికతో కథనం వెలువరించిన న్యూయార్క్ టైమ్స్.. భారత్ కనీసం 140 రిజిస్టర్డ్ స్పేస్ టెక్ స్టార్ట్-అప్‌లకు నిలయంగా మారిందని తెలిపింది. అంతేకాదు, ‘భూ గ్రహంతో సంబంధాన్ని కక్ష్య చివర అంచునకు తీసుకెళ్లే స్థానిక పరిశోధనా క్షేత్రాన్ని కూడా కలిగి ఉంది’ అని పేర్కొంది. మహమ్మారి ప్రారంభమైనప్పుడు ఐదు మాత్రమే ఉండగా స్టార్టప్‌ల వృద్ధి అపరిమిత వేగంతో ఉంది.. వారు అంతరిక్ష సేవల కోసం పెద్ద మార్కెట్‌ను సృష్టిస్తున్నారు’ అని ఆ కథనం అభివర్ణించింది.
‘శాస్త్రీయ శక్తిగా భారత్ ప్రాముఖ్యత’ ప్రధాన దశకు చేరుకుంటుందని నొక్కిచెప్పి న్యూయార్క్ టైమ్స్ నివేదిక.. గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను ప్రస్తావించింది. మోదీ, బైడెన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనను ఉటంకిస్తూ.. ‘ఇద్దరు నాయకులు అంతరిక్ష సహకారం అన్ని రంగాలలో కొత్త శిఖరాలకు చేరుకోవడానికి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేశారు’ అని వ్యాఖ్యానించింది. ‘అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ మొత్తం విలువలో అమెరికా, భారత్ ప్రైవేట్ రంగాల మధ్య మెరుగైన వాణిజ్య సహకారం, ఎగుమతి నియంత్రణల పరిష్కారం.. సాంకేతికత బదిలీని సులభతరం కోసం నాయకులు పిలుపునిచ్చారు’ అని స్పష్టం చేసింది.
‘అమెరికా, భారత్ రెండూ అంతరిక్షాన్ని తమ పరస్పర ప్రత్యర్థి అయిన చైనాకు పోటీగా ఉద్భవించే ఒక రంగంగా చూస్తాయి’ అని పేర్కొంది. ‘భారతదేశం ప్రయోజనాల్లో ఒకటి భౌగోళిక రాజకీయాలు’ అన్న ఆ పత్రిక.. రష్యా, చైనా చారిత్రాత్మకంగా అంతరిక్ష ప్రయోగాల కోసం తక్కువ ఖర్చు ఎంపికలను అందించాయని తెలిపింది. ‘కానీ ఉక్రెయిన్ యుద్ధంతో ఈ రంగంలో పోటీదారుగా ఉన్న రష్యా పాత్ర ముగిసింది’ అన్న న్యూయార్క్ టైమ్స్.. గతంలో మాస్కోతో ఒప్పందం చేసుకున్న బ్రిటన్ స్టార్ట్ అప్ వన్‌వెబ్ ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కక్ష్యలోకి పంపిందని గుర్తుచేసింది.
‘అలాగే చైనా ద్వారా కాకుండా భారతదేశం ద్వారా మిలిటరీ-గ్రేడ్ టెక్నాలజీని పంపే ఏ అమెరికన్ సంస్థనైనా యూఎస్ ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉంది’ అని వెల్లడించింది. అంతేకాదు, ‘మోదీ అంతరిక్ష రంగానికి పెద్ద పీట వేస్తూ జూన్ 2020లో చేసిన ప్రకటన.. అన్ని రకాల ప్రైవేట్ వ్యవస్థాపకులకు అవకాశాలు తెరిచింది.. భారత్ వ్యాపారాల నెట్‌వర్క్‌ను ప్రారంభించింది..ఇందులో ప్రతి ఒక్కటి అసలు పరిశోధన, స్వదేశీ ప్రతిభతో నడిచేది.. గత సంవత్సరం స్పేస్ స్టార్టప్‌లు కొత్త పెట్టుబడులు 120 మిలియన్ డాలర్లు సంపాదించాయి.. ఇది ఏటా రెట్టింపు లేదా మూడు రెట్లు పెరుగుతోంది’ అని వివరించింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్, ఏరోస్పేస్ తయారీదారు ధ్రువ్ స్పేస్ గురించి ప్రస్తావించింది.