రైతులకు డ్వాక్రా మహిళలు అండగా నిలవనున్నారు. వ్యవసాయ పనుల్లో వారికి సాయంగా నిలిచి డ్రోన్ల సాయంతో పురుగు మందులు, ద్రవ ఎరువులు పిచికారి చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నమో డ్రోన్ దీదీ పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలను వ్యవసాయ రంగంలో కూడా తీసుకొచ్చి వారికి జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా విద్యావంతులైన మహిళలకు సబ్సిడీపై డ్రోన్లు అందించనున్నారు. వీటి నిర్వహణపై శిక్షణ ఇచ్చి వ్యవసాయ పనులు చేయిస్తారు. తొలి విడతగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి మండలంలోని మూడు డ్వాక్రా గ్రూప్‌లలోని విద్యావంతుల్ని ఎంపిక చేస్తారు. వ్యవసాయ దిగుబడి వ్యయాన్ని తగ్గించడం, కూలీల సమస్యల అఽధికమించడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మహిళలకు మారుతున్న టెక్నాలజికి అనుగుణంగా అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలన్న లక్ష్యంతో మహిళలకు ఈ బాధ్యతల్ని అప్పగిస్తున్నారు. దానికి అనుగుణంగా డీఆర్‌డీఏ విద్యావంతులైన డ్వాక్రా మహిళల్ని ఎంపిక చేసే పనిలో పడింది. త్వరలో వీరిందరికీ వ్యవసాయశాఖ శిక్షణ ఇవ్వనుంది.