మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫడ్నవిస్ ను సీఎం చేయాలనే యోచనలో బీజేపీ అధిష్ఠానం ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఏక్ నాథ్ షిండే సంతోషంగా లేరని... ఆయన అసంతృప్తిని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ వివాదానికి త్వరలోనే తెరపడుతుందని అన్నారు. ఫడ్నవిస్ నాయకత్వంలో పనిచేసే విషయంపై షిండే ఆలోచించాలని రాందాస్ అథవాలే సూచించారు. షిండే ఉప ముఖ్యమంత్రి కావచ్చని లేదా కేంద్ర మంత్రి కూడా కావచ్చని చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ విషయంపై ఆలోచించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మహారాష్ట్ర కేబినెట్ లో తమ పార్టీకి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని... తమ పార్టీ డిమాండ్ ను ఫడ్నవిస్ ముందు కూడా ఉంచానని చెప్పారు