ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మరికొన్ని రోజుల్లో జరగనున్న మహా కుంభమేళా కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు రానున్న నేపథ్యంలో మహా కుంభమేళాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భద్రత, ఇతర తక్షణ అవసరాల కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్‌మెంట్‌లను సర్కార్ అలర్ట్ చేస్తోంది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి మహా కుంభమేళాలో తొలిసారి రోబోలను వినియోగిస్తున్నారు. కుంభమేళాలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా రోబోటిక్ ఫైర్ టెండర్లను అధికారులు రంగంలోకి దించారు.
వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఈ మహా కుంభమేళాలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రోబోటిక్ ఫైర్ టెండర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటితోపాటు మరో 200 ఫైర్ కమాండోలను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ పద్మజా చౌహాన్ వివరించారు. ఇక ఎమర్జెన్సీ సమయాల్లో ఫైర్ సిబ్బంది వెళ్లలేని ప్రాంతాలకు వెళ్లి.. బాధితులను రక్షించేందుకు 3 రోబోటిక్ ఫైర్ టెండర్లను ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఇక ఈ ఒక్కో రోబోటిక్ ఫైర్ టెండర్ 20 నుంచి 25 కిలోల బరువు ఉంటుందని.. ఇవి మెట్లు ఎక్కడంతో పాటు మంటలను కూడా అదుపులోకి తీసుకువస్తాయని పేర్కొన్నారు.
అంతేకాకుండా 35 మీటర్ల ఎత్తు నుంచి నీటిని స్ప్రే చేసే ఆర్టిక్యూలేటింగ్ వాటర్ టవర్‌లు.. అత్యాధునిక టెక్నాలజీ కలికి ఉన్న కెమెరాలను కూడా మహా కుంభమేళాలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ తరహాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఎస్‌టీఆర్‌జీని ప్రారంభించినట్లు ఏడీజీ పద్మజా చౌహాన్ తెలిపారు. ఈ యూనిట్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్ హైదరాబాద్‌లో శిక్షణ పొందిన 200 మంది సిబ్బంది ఉన్నట్లు వివరించారు. వారిని కుంభమేళా సమయంలో హై రిస్క్ జోన్ ప్రాంతాల్లో మోహరించనున్నట్లు వెల్లడించారు. ఇక గతంలో జరిగిన కుంభమేళాలో అగ్నిమాపక సేవల కోసం రూ.6 కోట్లను కేటాయించగా ఈసారి భారీగా పెంచినట్లు చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న మహా కుంభమేళాలో అగ్నిమాపక సేవల కోసం రూ.67 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు. ఇక 6 ఏళ్లకు ఒకసారి అర్థ కుంభమేళాను జరుపుతారు. కానీ మహా కుంభమేళా అంటే మాత్రం.. ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. గతంలో మహకుంభ మేళాను 2013లో నిర్వహించగా.. ఆ తర్వాత 2019లో అర్థకుంభ మేళా ఉత్సవాలను చేశారు. ప్రస్తుతం 2025లో మహాకుంభ మేళాను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి. ఈ మహాకుంభ మేళా 2025 ఉత్సవాలు.. వచ్చే ఏడాది జనవరి 29వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సిద్ధియోగాలో నిర్వహించనున్నారు. జనవరి 13వ తేదీన ప్రారంభం కానున్న ఈ మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది.