సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. ముంబై ఉగ్రదాడుల ఘటనపై చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంట్రెస్టింగ్ వీడియోలు, మంచి మెసేజ్‌ను అందించే వీడియోలను తరచూ షేర్ చేసి.. వారి ప్రతిభను కొనియాడడం.. వారికి తన వల్ల అయిన సహాయం చేయడం ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ చేసే పని. అయితే భారతదేశంతోపాటు.. పలు దేశాలను కూడా తీవ్ర షాక్‌కి గురి చేసిన ముంబై ఉగ్రదాడి జరిగి నేటితో 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ఆలోచింపచేస్తోంది.
2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో జరిగిన ఉగ్రదాడుల ఘటనపై తాజాగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ముంబై ఉగ్రదాడుల మారణహోమాన్ని ఎన్నటికీ మరచిపోమని పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. గతాన్ని గుర్తుపెట్టుకోలేని వ్యక్తులు.. మళ్లీ దాన్ని పునరావృతం చేస్తే వారికి శిక్ష పడాల్సిందే’’ అని ఒక రచయిత రాసిన కోట్‌ను ఆ ట్వీట్‌కు జత చేశారు. ఈ సందర్భంగా ముంబై ఉగ్రదాడులకు సంబంధించిన కొన్ని వీడియోలను షేర్ చేశారు.
ఇక ముంబై ఉగ్రదాడుల ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. అమరవీరులకు నివాళులు అర్పించారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ముంబై ఉగ్ర ఘటన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
అది 2008 నవంబర్ 26వ తేదీ.10 మంది పాక్ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబైకి చేరుకున్నారు. ముంబైలోని ఫేమస్ ప్రాంతాలు అయిన ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, తాజ్ హోటల్ సహా కీలక ప్రాంతాల్లో తుపాకులతో భారీ ఉగ్రదాడులకు దిగారు. నవంబర్ 29వ వరకు ఆ మారణహోమం 3 రోజుల పాటు సాగింది. ఈ కాల్పుల్లో 18 మంది పోలీసులు, సైనికులు సహా మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయాల పాలయ్యారు. ఇక భద్రత బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతం కాగా.. అజ్మల్ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం.. 2012 నవంబర్ 21వ తేదీన అజ్మల్ కసబ్‌ను ఉరితీశారు.