మహారాష్ట్ర ఎన్సీపీలో ఏర్పడిన సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు పోటా పోటీగా సమావేశాలకు పిలుపునిచ్చి, విప్ జారీ చేశాయి. ఈ నేపథ్యంలో బుధవారం బాంద్రాలోని ముంబయి ఎడ్యుకేషన్ ట్రస్ట్ భవన్‌లో అజిత్ పవార్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి కనీసం 18 మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే, మెజార్టీ ఎమ్మెల్యేల తమకుందంటే తమకుందని ఇరు వర్గాలు చెబుతుండటం గమనార్హం. అటు, ముంబయిలోని నారీమన్ పాయింట్‌లోని వైబీ చవాన్ సెంటర్‌లో శరద్ పవార్ సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశానికి ఎన్‌సీపీ ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరుకావాలని శరద్ పవార్ వర్గం నేత జితేంద్ర అవధ్ విప్ జారీ చేశారు. ఎన్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓ వీడియోను విడుదల చేస్తూ...పార్టీ నాయకులు, కార్యకర్తలను సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని, శరద్ పవార్ మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్దామని కోరారు. శరద్ పవార్‌కు అనుభవం, ప్రజాదరణ పుష్కలంగా ఉండటంతో ఎమ్మెల్యేలు ఆచరణాత్మక నిర్ణయం తీసుకోవాలని అజిత్ వర్గం కోరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సమావేశానికి ముందు పలువురు ఎమ్మెల్యేలకు అజిత్ వర్గం ఇలాగే ఫోన్లు చేసినట్టు తెలుస్తోంది. అజిత్ వెంట వస్తే 2024 ఎన్నికల్లో ప్రయోజనం ఉంటుందని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘మాతో చేతులు కలిపితే 2024 ఎన్నికల్లో మీకు మేలు జరుగుతుంది.. మీ నియోజకవర్గంలో నిధులు మంజూరు కాకుండా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తియ్యేలా మేం మీకు సహాయం చేస్తాం’ అని వారికి గాలం వేస్తున్నారని భోగట్టా.
శరద్ పవార్‌ను పార్టీ శాసనసభ్యులు గౌరవిస్తున్నందున ఆచరణాత్మక నిర్ణయం తీసుకోవాలని, కాలం మారిందని అజిత్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక, సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ మద్దతుదారులు అఫిడవిట్‌పై సంతకం చేయిస్తున్నారు. పార్టీ పేరు, గుర్తు తమకే కేటాయించాలని కోరుతూ ఈ సంతకాలతో కూడిన లేఖను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించనున్నారు.