ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారాలపై సర్వోన్నత న్యాయస్థానం ముందుకు మంగళవారం కీలక విన్నపం వచ్చింది. మనీల్యాండరింగ్ కేసుల దర్యాప్తులో ఈడీకి ‘విస్తృతమైన అధికారాలు’ కల్పించామని, ఈ అధికారాలకు పగ్గాలు వేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. గురుగ్రామ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ గ్రూప్ ఎం3ఎంకి సంబంధించిన పిటిషన్‌లపై విచారణ సందర్భంగా.. జస్టిస్ ఏ ఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనానికి సీనియర్ న్యాయవాదులు ఈ విన్నపం చేయడం గమనార్హం.
ఎం3ఎం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే.. ‘ఈడీకి విస్తృతమైన అధికారాలు ఇచ్చారు.. ఒకవేళ కోర్టు వీటికి అడ్డుకట్టవేయకపోతే దేశంలో ఏ ఒక్కరూ భద్రంగా ఉండరు.. విచారణకు వారు సహకరిస్తుంటే ఎలా అరెస్ట్ చేశారో చూడండి.. ఈ అరెస్టు హక్కులను ఉల్లంఘించడమే... ఈ అధికారాలకు పగ్గాలు వేయాల్సిందే’ అని వివరించారు. ఎం3ఎం డైరెక్టర్లు బసంత్ బన్సాల్, పంకజ్ బన్సాల్‌ను మనీల్యాండరింగ్ కేసులో జూన్ 14న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారి తరఫున సీనియర్ లాయర్లు హరీశ్ సాల్వే, ముకుల్ రోహత్గీలు హాజరయ్యారు.
బన్సల్ సోదరులు ముందస్తు బెయిల్ కోసం పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయిస్తున్నారని, వారి పిటిషన్లను పరిష్కరించాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మనీలాండరింగ్ విచారణలో మాజీ జడ్జిపై లంచం కేసుతో పాటు ఎం3ఎం డైరెక్టర్ల అరెస్ట్‌లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై సవాళ్లతో సహా ఒక బ్యాచ్ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది.
మనీల్యాండరింగ్ కేసులో అరెస్టైన బన్సాల్ సోదరులకు పంచకుల పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ఐదు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. జూన్ 9న ఇదే కేసులో బసంత్,పంకజ్ బన్సల్‌లకు పంజాబ్ హరియాణ హైకోర్టు జూలై 5 వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేసింది. అయినా సరే వారిని అరెస్ట్ చేయడం గమనార్హం. అటువంటి కస్టడీ చట్టవిరుద్ధమైన నిర్బంధానికి సమానమని, మనీలాండరింగ్ కేసులో బలవంతపు చర్య నుంచి తమకు రక్షణ కల్పిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనబెట్టారని వారి తరఫున లాయర్లు వాదించారు.
బన్సల్ సోదరులను అరెస్టైన కేసు.. పంచకులలో డైరెక్టర్‌గా నియమితులైన రూప్ కుమార్ బన్సాల్, మరొక వ్యక్తికి సంబంధించింది. ఈ కేసులో సీబీఐ మాజీ ప్రత్యేక న్యాయమూర్తి సుధీర్ పర్మార్‌పై ఏప్రిల్ 17న హరియాణా పోలీసు అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. నిందితులకు అనుకూలంగా న్యాయమూర్తి పర్మార్ వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. ఏసీబీ కేసు నమోదు చేయడంతో పర్మార్‌ను విధుల నుంచి పంజాబ్ హరియాణా హైకోర్టు తప్పించింది.