తన సోదరుడు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా తాను మాత్రం చిన్న టీ కొట్టు నడుపుకుంటూ అత్యంత నిరాడంబరంగా జీవిస్తున్నారు. ఆమే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరి శశి పాయల్. సోదరుడు సీఎం అంటే వేరే లెవెల్‌లో ఉంటుంది. కానీ, శశి సింగ్ పాయల్ మాత్రం అందుకు భిన్నంగా సాదాసీదా జీవితం గడుపుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లోని ఫౌరీ గర్వాల్‌లోని మాతా భువనేశ్వరి ఆలయ సమీపంలో శశి పాయల్ టీ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి వెళ్లాలంటే 2 కిలోమీటర్ల ముందే వాహనాలు నిలిపి.. అక్కడ నుంచి కాలినడకన చేరుకోవాలి. అటువంటి ప్రాంతంలో ఆమె ఓ చిన్న టీ దుకాణం నడుపుతుండటం గమనార్హం.
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే దినేశ్ చౌదరి.. శశి పాయల్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. తమ్ముడు ముఖ్యమంత్రి అయినా ఆమెలో ఏమాత్రం గర్వం కనిపించలేదని ఆయన రాసుకొచ్చారు. చాలా మంది పర్యాటకులకు ఇక్కడకు వచ్చే వరకూ ఈ విషయం తెలియదని చెప్పారు. సీఎం యోగి గురించి తనతో చాలా విషయాలను పంచుకున్నారని వివరించారు.
‘మారుమాల ప్రాంతంలోని దేవీ ఆలయానికి వెళ్లిన భక్తులు.. దేశంలో శక్తివంతమైన నేతల్లో ఒకరైన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరి అక్కడ టీ దుకాణం నడుపుతున్నట్టు తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు.. ఆమె సింప్లిసిటీకి సెల్యూట్ చేస్తున్నారు.. ఆదిత్యనాథ్ జీ వ్యక్తి ముఖ్యమంత్రిగా లభించడం ఉత్తరప్రదేశ్ ప్రజలు, మనందరం చేసుకున్న అదృష్టం. ’ అని మాజీ ఎమ్మెల్యే ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఇక, యోగి ఆదిత్యనాథ్ తల్లిదండ్రులకు ఏడుగురు సంతానం. వీరిలో శశి పాయల్ అందరికంటే పెద్ద.. యోగి ఐదో సంతానం. అయితే, యోగి సన్యాసం తీసుకునే వరకూ కుటుంబంతోనే ఉన్నారు. 1994లో సన్యసించిన ఆయన.. అప్పటి నుంచి కుటుంబానికి దూరంగా ఉన్నారు. కొఠార్ గ్రామానికి చెందిన పురాన్‌సింగ్‌ను శశి వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. రక్షాబంధన్ రోజున ప్రతి ఏటా తన సోదరుడికి రాఖీ పంపిస్తుంటానని శశి తెలిపారు.
![]() |
![]() |