వాతావరణ శాఖ వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో వాయుగుండం తమకు గండంలా మారేలా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్వా పంట చేతికి అందే సమయంలో వాయుగుండం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోసిన చేలను ఒబ్బిడి చేసుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకుని రాశులుగా చేసుకుంటున్నారు.
మామిడికుదురు మండలంలో 2420 ఎకరాల్లో సార్వా పంట పండించారని, ఇప్పటివరకు 230ఎకరాల్లో రైతులు పంటను ఒబ్బిడి చేసుకున్నారని, 30ఎకరాల్లో వరి పనలపై ఉందని, ఇప్పటివరకు 370క్వింటాళ్ల ధాన్యం మిల్లులకు తరలించినట్టుగా వ్యవసాయాధికారి పి.మృదుల తెలిపారు. వాయుగుండ ప్రభావంతో గాలులు, వర్షాలు వస్తే పంట నేలను అంటి అపార నష్టం వాటిల్లే ఆస్కారం ఉందని రైతులు పేర్కొంటున్నారు.