కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. శ్రీకాకుళం నగరంలోని నాగావళి నది ఒడ్డున ఉన్న ఉమారుద్ర కోటేశ్వరాలయంలో ఉదయం 5 నుంచి దర్శనానికి బారులుదీరారు. ఈశ్వరుడికి మహాన్యాస పూర్వక అభిషేకాలు, క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆరవెల్లి శ్రీరామమూర్తి ఆద్వర్యంలో లక్ష రుద్రాక్షలతో ఉమారుద్ర కోటేశ్వరుడిని అలంకరించారు. అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా అలంకరించారు. మహిళలు ముందుగా నందీశ్వరుని వద్ద దీపాలు వెలిగించి అనంతరం స్వామి వద్దకు వెళ్లి పూజలు చేశారు.
నక్కవీధిలోని ఉమాజఠళేశ్వరాలయం, కొన్నా వీధిలో భీమేశ్వర ఆలయం, గుజరాతిపేటలోని లక్షేశ్వరస్వామి ఆలయం, బలగలోని ఉత్తరేశ్వరాలయంలో, దీపామహాల్ వెనుక ఉన్న కాశీ విశ్వేశ్వర ఆలయం, మహాలక్ష్మి నగర్ కోలనీలోని మండలేశ్వరాలయం, పాల కొండ రోడ్డులో ఉన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయాలకు కూడా భక్తులు పోటెత్తారు. బొందిలీపురం షిరిడీ సాయిబాబా ఆలయంలో ఉన్న శివలింగానికి భక్తులు క్షీరాభిషేక పూజలు చేశారు. నారాయణ తిరుమల, చిన్నబజార్‌లో ఉన్న దూదివారి కోవెల వెంకటేశ్వర స్వామి ఆలయం, విశాఖ ఏ కోలనీలో ఉన్న శివబాలాజీ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.