మెక్‌డొనాల్డ్స్. ఈ స్టోర్లలో ఉండే రకరకాల ఐటెమ్స్ అంటే చాలా మందికి ఇష్టం. అందుకే అందులోకి వెళ్లి లొట్టలేసుకుంటూ తినేవారు చాలా మందే ఉంటారు. అయితే ప్రస్తుతం మన దేశంలో టమాటా ఫీవర్ నడుస్తోంది. చుక్కలను అంటిన టమాటా రేట్లతో సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, దేశంలో హీట్ వేవ్ కారణంగా చాలా రాష్ట్రాల్లో టమాటా పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో దేశవ్యాప్తంగా టమాటా రేట్లు భగ్గుమంటున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కిలో టమాటా ధర రూ. 150 నుంచి రూ. 200 ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే రూ. 250 కూడా ఉంది. అయితే ఈ టమాట ధరల పెరుగుదల తాకిడి మెక్‌డొనాల్డ్స్‌కు కూడా చేరింది. దీంతో మెక్‌డొనాల్డ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తాము అందించే ఆహార పదార్థాల్లో టమాటా ఉండదని పేర్కొంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న తమ స్టోర్లలో బర్గర్లు, రాప్‌లు సహా వివిధ ఐటెమ్స్‌ల నుంచి టమాటాలను తొలగించాలని నిర్ణయం తీసుకుంది.
బర్గర్లు, రాప్‌లు సహా వివిధ ఆహార పదార్థాల్లో టమాటాలు చాలా కీలకం. టమాటాల కారణంగా వాటి టేస్టే మారిపోతుంది. మెక్‌డొనాల్డ్స్ తీసుకున్న ప్రస్తుత నిర్ణయంతో తమ ఐటెమ్స్‌లో టమాట ఉండదు. దేశంలో టమాటా లభ్యత తగ్గిపోవడం, సరఫరాలో సమస్యలు, టమాటా పంట నాణ్యత దెబ్బతినడం, రికార్డు స్థాయిలో ధరలు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెక్ డొనాల్డ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము వినియోగించే నాణ్యత కలిగిన టమాటాలు దొరకడం లేదని మెక్‌డొనాల్డ్స్ వెల్లడించింది. అందుకే ఇంతి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న మెక్‌డొనాల్డ్స్ స్టోర్లలో నోటీసులను అంటించారు. టమాటాలు లేకుండానే తమ ఆహార పదార్థాలను అందించాల్సి వస్తుందని పేర్కొంది. అయితే దక్షిణ భారత దేశం సహా పశ్చిమ భారత దేశంలో ఈ సమస్య లేదని మెక్‌డొనాల్డ్స్ చెప్పింది.