అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉరవకొండలో సుమంత్ అనే డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్నేహితుడు ఇంటికి వెళ్లగా.. సుమం్ మృతదేహాం వేలాడుతూ ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. దీంతో వెంటనే స్థానికులతో పాటు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే సుమంత్ ఇంటికి చేరుకుని పరిశీలించారు. సుమంత్ సూసైడ్ లేఖ రాసి చనిపోయినట్లు గుర్తించారు. సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు.
సుమంత్ మృతదేహాన్ని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్‌ను పరిశీలించిన పోలీసులు.. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని తేల్చారు. తాను ఒక అమ్మాయిని ప్రేమించానని, తను అంటే తనకు చాలా ఇష్టమని లేఖలో తెలిపాడు. ఆ అమ్మాయిని ఎవరు ఏమీ అనవద్దని, తనను ఏదైనా అంటే తాను చాలా బాధపడతానని పేర్కొన్నాడు.
చివరిసారిగా ఆ అమ్మాయి తనను ఒక్కసారి చూసి వెళ్లాలని కోరుకుంటున్నట్లు సుమంత్ లేఖలో ప్రస్తావించాడు. ఆ అమ్మాయిని తాను ఎప్పుడైనా తెలిసో, తెలియకో బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరుతున్నట్లు చెప్పాడు. ఇకపై తాను ఈ లోకంలో ఉండనని, ఇదే తన చివరి మెసేజ్ అంటూ లేఖలో తెలిపాడు. ఈ సూసైడ్ లేఖ అందరికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. ఈ లేఖ ఆధారంగా పోలీసుల విచారణ కొనసాగుతోంది. అయితే సుమంత్ తల్లి ఏదో పని మీద తిరుపతికి వెళ్లగా.. సోదరుడు అనంతపురం వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సుమంత్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సుమంత్ మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు.