ఓ రోగి ఏకంగా వైద్యుడినే బోల్తా కొట్టించాడు. నకిలీ నోటు ఇచ్చి ఎంచక్కా వైద్యం చేయించుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత కానీ అది నకిలీ నోటు అని వైద్యుడు గుర్తించలేకపోయాడు. సదరు డాక్టర్ ఈ విషయాన్ని ఫొటోతో సహా సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. అయితే, అది నకిలీ నోటు అని ఆ పేషెంట్ కు కూడా తెలిసి ఉండదని, వేరెవరో ఇచ్చిన నోటును తనకు ఇచ్చి ఉంటాడని డాక్టర్ మానవ్ అరోరా తన పోస్టులో చెప్పుకొచ్చారు.
డాక్టర్ మానవ్ అరోరా ఆర్థోపెడిక్ సర్జన్ గా రోగులకు సేవలందిస్తున్నారు. ఇటీవల ఆయన దగ్గరికి వచ్చిన ఓ రోగి కన్సల్టేషన్ ఫీజు కింద రూ.500 నోటు ఇచ్చాడు. ఆ సమయంలో రిసెప్షనిస్ట్ నోటును పరిశీలించకుండానే తీసుకుంది. సదరు రోగి డాక్టర్ ను కలిసి, మందులు రాయించుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం డబ్బుల లెక్కలు చూస్తుండగా నకిలీ 500 నోటును గుర్తించినట్లు డాక్టర్ మానవ్ చెప్పారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించి నవ్వుకున్నట్లు తెలిపారు. ఆ నకిలీ నోటును తాను భద్రంగా దాచుకుంటానని డాక్టర్ మానవ్ అరోరా చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. డాక్టర్ మానవ్ అరోరా స్పోర్టివ్ నెస్ ను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.